ప్రజాశక్తి - నిడమర్రు
రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 72 షెడ్యూలు రంగాలకు సంబంధించిన వేతన సవరణ వెంటనే చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజా రామ్మోహన్ రారు డిమాండ్ చేశారు. నిడమర్రులో శనివారం ప్రారంభమైన జిల్లా సిఐటియు ముఖ్య కార్యకర్తల శిక్షణా తరగతులలో రెండో రోజు ఆదివారం ఆయన పాల్గొన్నారు. కె.విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహిస్తున్న తరగతుల్లో రారు మాట్లాడుతూ రాష్ట్ర సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి, కేవలం పదివేల మందిని మాత్రమే చేస్తున్నారని దుయ్యబెట్టారు. ఆశ, అంగన్‌వాడీ, మిడ్ డే మీల్స్, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో బిల్డింగ్ వర్కర్లకు ఉన్న వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించాలని, రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పారిశుధ్య కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న వారిని, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ పేరిట ఉన్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు డైరెక్టర్ పేమెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న వలస కార్మికులకు రక్షణ కల్పించాలని, వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావలసిన రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, ప్రత్యేక హోదా వంటి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. కార్మికవర్గం ఎన్నో పోరాటాలతో సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చుతోందని, దీనిని కార్మిక, ఉద్యోగ, శ్రామిక వర్గం అంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతుల్లో సిఐటియు జిల్లా నాయకులు నారపల్లి రమణారావు, ఎస్‌కె.సుభాషిని, వై.సాయికిరణ్, ప్రసాదు, హరికుమారి, శ్రీను, జి.సత్యనారాయణ, జె.గోపి, మాణిక్యం పాల్గొన్నారు.










