మదనపల్లె అర్బన్ :
దళితుల భూములను కబ్జా చేస్తే జైలుకు పంపుతామని ఎస్‌సి కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని బి.కె. పల్లి గ్రామంలో సర్వే నంబర్ 522/1 భూమిని ఆయన పరిశీలించారు. ఆయన రాకతో డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, సిఐ అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, దళిత సంఘాల నాయకులు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌సి కమిషన్ చైర్మన్ రెవెన్యూ, పోలీసు అధికారులతో భూ సమస్యపై చర్చించారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. .రికార్డులు టాంపరింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో సంబందిత అధికారులపైనా, కబ్జాకు పాల్పడిన వ్యక్తులపైనా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈసందర్బంగా నిర్వహించిన సమావేశంల చైర్మన్ మాట్లాడుతూ సర్వేనంబర్ 522/1, 522/2లలో బాధితులకు చెందిన 9ఎకరాల భూమి ఉందని, 1905లో వారికి బ్రిటిష్ ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. భూముల విలువ పెరగడంతో ఓ వ్యక్తి బాధితుల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తమదృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు విచారణకు వచ్చానని తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే దళితుల భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోందని చెప్పారు. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో దురాక్రమణకు గురైన దళితుల భూములన్నీ తిరిగి దళితులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దురాక్రమణకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకులు శివప్రసాద్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణరాజు సమావేశంలో ప్రశాంగించారు. కార్యక్రమంలో విసికె రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రభు పాల్గొన్నారు.










