
బలిజిపేట: మండలంలోని పెదంకలాం ఆనకట్ట అభివృద్ధికి మంజూరైన జైకా నిధులు ఖర్చు పెట్టకుండా అధికారులు, పాలకులు ఏం చేశారని, సకాలంలో కాలువ పనులు పూర్తి చేయకపోవడంతో తమ పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన నాయకులు బలగ సత్యనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గేదెల సత్యనారాయణ మాట్లాడుతూ పనుకువలస, అరసాడ, పెదమాయవలస, రావివలస, నారాయణపురం, వెంగాపురం, చెల్లింపేట, తుమరాడ, బలిజిపేట, పలగర, చిలకలపల్లి, వెంగళరాయపురం, విజయనగరం జిల్లా వంగర మండలం చంద్రంపేట, ఇరువాడ, మరువాడ, కోనంగిపాడు, గీతనాబిల్లి తదితర 18 గ్రామాల పరిధిలో 8వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంకలాం కాలువ అభివృద్ధి పేరిట ఈ నాలుగేళ్లలో చుక్కనీరు ఇవ్వలేదని విమర్శించారు. మూడేళ్ల కిందట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్భాటంగా జైకా నిధులు రూ.18కోట్లతో పనులు ప్రారంభించినా ఎందుకు ముందుకు సాగడంలేదని ప్రశ్నించారు. కనీసం అధికారులకు, నాయకులకు తెలుసుకొనే తీరికలేకపోవడం దురదృష్టమన్నారు. ఖరీఫ్ సీజన్ రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ శ్రమదానంతో గండ్లు పూడ్చుకొని కాలువల్లోని పూడిక తొలగించుకున్నారన్నారు. అసలు మంజూరైన రూ.18 కోట్లు ఏమైయ్యాయని, ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయలేదా, లేకుంటే అందరూ కలిసి పంచుకున్నారా అనేది అధికారులు, ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఎవరూ చెప్పడం లేదని, ఎప్పుడు పూర్తి చేస్తారో అది కూడా చెప్పడం లేదని అన్నారు. రైతు సంఘం, రైతులు పరిశీలన నేపథ్యంలో అనేక సమస్యలు బయటకు వచ్చాయన్నారు. ఆనకట్ట దగ్గర షట్టర్లు సక్రంగా లేవని, ఎక్కడపడితే అక్కడ గండ్లు ఉన్నాయని, కాలువ మొత్తం పూడికలతో పేరుకు పోయిందన్నారు. వర్షాభావం వల్ల వరి పంట పొట్ట దశలో వర్షాలు లేక చివరి భూములకు నీరు రాక రైతులు సొంత డబ్బులతో కాలువల్లో పూడుకలు తీసుకోవడం దురదష్టకరమని అన్నారు. తక్షణమే కాలువలో పూడికలు తీయాలని, జైకా నిధులు ఏమయ్యాయో రైతులకు చెప్పాలని, కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఈనెల 23న స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా తలపెట్టినట్టు తెలిపారు. కావున ఈ ధర్నాలో రైతులంతా పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ పిలుపునిచ్చింది. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వంజరాపు సత్యనాయడు, కౌలు రైతు జిల్లా కార్యదర్శి ఆవు సాంబమూర్తి, భానుమూర్తి, గౌరినాయుడు, పోలినాయుడు, త్రినాధ్, నారాయుడు, అప్పలస్వామి, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు.