ప్రజాశక్తి - బలిజిపేట : మండలంలోని పెదంకలాం ప్రధాన కాలువ ద్వారా సాగునీరు రైతులకు అందాలనే ఉద్దేశంతో గతేడాది 2న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పెదంకలాం ఆనకట్టు ఆధునీకరణ పనులకు జైకా నిధులు రూ.17 కోట్ల 30 లక్షలతో ప్రధాన కాలువ వద్ద శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అయితే కాలువకు ఎక్కడపడితే అక్కడ గండిపడడం, పెద్ద పెద్ద పిచ్చిమొక్కలు కాలువ మధ్యలో పెరిగిపోవడంతో నీరు రాకుండా గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రైతులే వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి కాలువ గండ్లుపూడ్చుకుంటున్నారు. కోట్లలో నిధులు ఉన్నా అధికారులు పనులు చేయకపోవడంతో కాలువ ద్వారా సాగునీరందక రైతుకు తలనొప్పిగా మారింది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు పెదంకలాం అభివృద్ధి పనుల కోసం ప్రారంభం నుంచి చివర వరకు సుమారు 25 కిలోమీటర్లు పొడవున ఉన్న కాలువ వల్ల 8వేల ఎకరాల్లో సాగు నీరు రైతులకు అందాలి. నాటి నుండి నేటి వరకు పూర్తిస్థాయిలో నీరు ఎప్పుడూ అందలేదు. కాలువ మరమ్మతుల కోసం అప్పట్లో రూ.30 కోట్లు ప్రతిపాదనలు పంపించగా రూ.17.30 కోట్లు జైకా నిధులు మంజూరయ్యాయి. మూడేళ్లవుతున్నా ఈ ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం కాలువ పనులు సక్రమంగా జరగకపోవడం. ఇరిగేషన్ అధికారులు దూర ప్రాంతాల నుంచి నివసించడం, పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒక దగ్గర 60 సెంటీమీటర్లు సైడ్ ర్యాంపు, మరో దగ్గర రెండు పక్కల సైడ్ ర్యాంపులు వేసి బేస్మెంట్ మర్చిపోయారు. కానీ నిధులు మాత్రం దోచుకున్నారు. హెడ్ దగ్గర సెంటర్లు మరమ్మతులకు గురయ్యాయి. కాలువల వద్ద గండ్లు ఏర్పడ్డాయి. పిల్ల కాలువలు సరిగ్గా లేవు. ఏ విధంగా చూసినా ప్రధాన కాలువ పనులు మరమ్మతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనిపిస్తున్నాయి. ఇలా ఉంటే మరో పదేళ్లయినా కాలువ ద్వారా సాగునీరు రైతులు అందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి రైతులు గండ్లు పూడ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. మండలంలోని వెంగాపురం, నారాయణపురం గ్రామానికి చెందిన సుమారు 100మంది రైతులు ప్రధాన కాలువలో ఒక గండిని పూడ్చారు. ఎమ్మెల్యే సొంత మండలంలోని తమకు ఇటువంటి సమస్యలు వెంటాడడం చాలా బాధాకరమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఆటంకాలు వస్తే తమ పరిస్థితి అధ్వానంగా మారుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువ చివరి భూములకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.










