Jul 22,2023 22:02

కరపత్రాలను విడుదల చేస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి - బలిజిపేట : పెదంకలాం ఆనకట్టు పునులకు జైకా నిధులు మంజూరైనా ఎందుకు పనులు పూర్తి చేయాలని రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. ఈ మేరకు ఈనెల 26న కలెక్టరేట్‌ వద్ద ధర్నా తలపెట్టామని, ఈ కార్యక్రమంలో రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రజాసంఘాల ఆధ్వర్యాన రైతు సంఘం రైతుల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బద్దన భానుమూర్తి, నల్ల ఈశ్వరరావు మాట్లాడుతూ పనుకువలస, అరసాడ, పెదమాయివలస, రాయవలస, నారాయణపురం, వెంగాపురం, చెల్లింపేట, తుమరాడ, బలిజిపేట, పలగర, చిలకలపల్లి, వెంగళరాయపురం, చంద్రంపేట, ఇరువాడ, మరువాడ, కోనంగిపాడు. గీతనా తదితర గ్రామాల పరిధిలో 8000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అంకలాం కాలువ అభివృద్ధి పేరుకే తప్ప ఈ నాలుగేళ్లలో చుక్క నీరు ఇవ్వలేదన్నారు. మూడేళ్లు కిందట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్భాటంగా జైకా నిధులు రూ.18కోట్లుతో పనులు ప్రారంభించినా ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. కనీసం నాయకులు, అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ రావడం వల్ల తప్పని పరిస్థితుల్లో రైతులు గండ్లు పూడ్చుకోవల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇటీవల రైతు సంఘం నాయకులు తలపెట్టిన పరిశీలన నేపథ్యంలో అనేక సమస్యలు బయటకు వచ్చేయని, ఆనకట్ట దగ్గర షట్టర్లు కూడా సక్రంగా లేవని, ఎక్కడపడితే అక్కడ గండ్లు ఉన్నాయని, కాలువ మొత్తం పూడిక పేరుకు పోయిందని తెలిపారు. ఈ సందర్బంలో కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఈనెల 26 కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయనున్నామని, ఈ ధర్నాకు రైతులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలినాయుడు, నారాయుడు, అప్పలస్వామి, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు.