ఆంజనేయులు చాలా మంచివాడు. యువకుడు. దైవభక్తి మెండుగా ఉన్నవాడు. వాళ్ళ నాన్న అతగాడికి ఆ పేరెందుకు పెట్టాడో అడిగి తెలుసుకోవాలనే పాటి ఇంగితజ్ఞానం ఆంజనేయులికి వచ్చేనాటికే పాపం! వాళ్ళ నాన్న అకాలంగా కాలం చేసేడు. అమ్మకా విషయం తెలియదని చెప్పేసింది. ఇక తాతగారిని అడిగితే ఆయన హనుమంతుడి గురించి, ఆయన గొప్పదనం గురించి చాలా, చాలా చెప్పేడే తప్ప తనకు ఆ పేరే ఎందుకు పెట్టేరో ఆ సంగతి మాత్రం ఆంజనేయులికి ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు ఇక తెలుసుకోవాలని కూడా అతను అనుకోవడం లేదు. కాని తాతగారి నుండి విన్న పురాణాల పుణ్యమా అంటూ గొప్ప హనుమంతుడి భక్తుడు అయిపోయేడు ఆంజనేయులు. ప్రతీ మంగళవారం ఉపవాసం ఉంటాడు. ప్రతీ రోజూ హనుమాన్ చాలీసా చదువుతాడు. బ్రహ్మచారిగానే జీవిస్తానని శపధం చేసి ఇంతవరకూ నిలబెట్టుకునేవున్నాడు. పేరు చిరంజీవి అని మార్చుకున్నాడు గనుక చిరంజీవి సినిమాలన్నీ చూడడమే కాకుండా ఆయనకీ, ఆయన పెట్టిన పార్టీకీ గొప్ప అభిమాని అయిపోయేడు.
మంచివాడు గనుక ఆంజనేయుల్ని అందరూ అభిమానిస్తారు. అతడి భక్తి వీక్‌నెస్ ని కనిపెట్టి అతనితో ఆ వీధిలోని చాలామంది అనేక రకాల పనులు చేయించుకుంటూ వుంటారు. ''నువ్వు ఆ హనుమంతుడంతటివాడివి '' అని అంటే చాలు. ఏ పని చేయడానికైనా ఒప్పేసుకుంటాడు ఆంజనేయులు.
ఈ మధ్య ఓ దేవస్థానం బోర్డు వారు హనుమంతుడి జన్మస్థానం ఫలానా అంజనాద్రి అని, అది మా దేవస్థానం కొండల్లోనే ఉందని, పురాణాలను పరిశోధించి తేల్చామని ప్రకటించారు. వెంటనే కాలినడకన అంజనాద్రికి పోవాలని ఆంజనేయులు డిసైడ్ అయిపోయాడు. అందరికీ ఈ విషయం చెప్పేశాడు కూడా. కాని మర్నాడే ఇంకో స్వామీజీ కర్నాటక నుండి దానిని ఖండిస్తూ మరో ప్రకటన చేశాడు. ''పంపానదీ తీరాన ఉన్న అంజనహళ్ళి హనుమంతుడి జన్మస్థలం'' అని చెప్తున్నాడాయన. ఆయన వాదనకు కొన్ని పురాణాలు సపోర్టుగా ఉన్నాయి. ఈ ప్రకటన తర్వాత మన ఆంజనేయులికి సమస్య వచ్చిపడింది. ''నీ జన్మస్థానాన్ని కాలినడకన దర్శించుకుంటాన''ని కదా తాను మొక్కింది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అంజనాద్రా లేక అంజనహళ్ళా? పెద్ద పెద్ద పండితులే తగువులాడుకుంటూంటే నేనేం చెప్పగలనని ఊళ్ళోని పూజారి చేతులెత్తేశాడు కూడా. ''ఇప్పుడేం చేయాల్రా ఆంజనేయా...'' అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఆంజనేయులు.
***
కళ్ళు తెరిచేసరికి తానొక దట్టమైన అడవిలో ఉన్నట్టు గమనించాడు. ఏం చేయాలో తోచక అయోమయంగా అడుగులు ముందుకేశాడు. ఆశ్చర్యం! మహదానందం! ఎదురుగా చెట్టు కింద ఆంజనేయస్వామి ధ్యానం చేసుకుంటూ కనిపించాడు.
''ఓహో ఆంజనేయా! ఏమిటి నీ మహత్తు ! నిన్ను ఎలా చేరుకోగలను అని నేను మథన పడుతూండగానే నువ్వే దర్శనమిచ్చావే!'' అంటూ సాష్టాంగపడ్డాడు.
''బాబూ! నిన్ను లేవదీసే ఓపిక నాకు లేదు. నువ్వే లేచి నిలబడు'' అని హనుమంతుడు అనగానే దిగ్గున లేచాడు ఆంజనేయులు.
'' అదేమిటి స్వామీ ! నువ్వు మహా శక్తిశాలివి కదా! ఓపిక లేకపోవడమేమిటి?'' అనడిగాడు.
'' నన్ను చిరంజీవిగా బతకమన్నాడే కాని ఆ రామ ప్రభువు నాకు మొదటి రోజులలో ఉండిన బలం అంతా అలానే కొనసాగాలని వరం ఇవ్వలేదు కదా. ఇప్పుడేమిటి, ఆనాడు భీముడు వచ్చి దారికి అడ్డంగా ఉన్న తోకను తప్పించమని అడిగినప్పుడే ఆ తోకను ఎత్తలేనని చెప్పిన సంగతి మరచావా ?'' అని స్వామి క్లారిఫికేషన్ ఇచ్చాడు.
''ఒక సమస్య నన్ను వేధించడంతో నిన్న రాత్రి తమర్ని తలచుకున్నాను స్వామీ. తమరు పుట్టింది ఎక్కడీ అంజనాద్రిలోనా లేక అంజన హళ్ళి లోనా?'' అనడిగాడు ఆంజనేయులు.
''ఏమో నాయనా, గాలికి పుట్టినవాడిని... అదే... వాయుదేవుడికి పుట్టినవాడిని, నాకూ తెలియదు. భూలోకంలో ఇన్నాళ్ళకి ఎందుకో గాని ఇప్పుడీ గొడవ వచ్చింది మరి. గతంలో రామ ప్రభువులవారి జన్మస్థానం గురించి కూడా తగువు వచ్చిందని, దాంతో చాలా గొడవలు జరిగాయని, చాలా రాజకీయాలు నడిచాయని తెలిసింది. ప్రభువు అందుకు చాలా ఆగ్రహించి ఆ నీచ వివాదాలకు ఆయన దూరంగా ఉండడమే గాక నన్నూ దూరంగా ఉండమన్నారు. ఇప్పుడు నా జన్మస్థలం తగువు తలెత్తింది. దీంతో ఏం గొడవలు వస్తాయో '' అని వాపోయాడు.
''పోనీ, తమ తల్లి గారిని అడగకపోయారా స్వామీ ? ''
''ఇలాంటి తగువు వస్తుందని తెలిసివుంటే అప్పుడే అడిగి వుండేవాడిని. ఆమె అప్పుడే పోయింది. ఆ మధ్య బ్రహ్మ దగ్గర రికార్డేమైనా ఉందేమోనని వాకబు చేశాను. అవి త్రేతాయుగం రికార్డులు. ఇప్పుడింకా ఎక్కడుంటాయి? ఇదేమైనా భూలోకం అనుకున్నావా? అంటూ ఆయన కేకలేశారు.'' అన్నాడు స్వామి.
మరి తగువులాడుకుంటున్నవారిలో ఎవరు కరెక్టు? అని ఆంజనేయులు అడిగాడు.
''నేనెక్కడ పుడితే వాళ్ళకెందుకయ్యా ఇప్పుడు? నాకేమైనా కొత్తగా దేవాలయాలు కట్టాలా? కట్టిన చోటల్లా నేను పుట్టిన స్థలమేనా? ఇంతకీ నేనేమైనా వచ్చి అక్కడ ఉంటానా? నీకు తెలుసు కదా? సుందరకాండ ఎక్కడ పారాయణం చేసినా నేను అక్కడికి వచ్చి వింటానని? ఆపని చేయడం మానేసి ఈ తగువులెందుకు? అసలు ప్రస్తుతం జనం అంతా కరోనా మహమ్మారితో ఛస్తూవుంటే వాళ్ళకి సేవలు చేయడం మానేసి ఇలాంటి తగువులు పెట్టుకోమని వీళ్ళకి చెప్పిన ఆ దద్దమ్మ ఎవడంట? '' అని గర్జించాడు స్వామి.
స్వామికి కోపం వస్తోందని గమనించాడు ఆంజనేయులు. చూస్తూండగానే స్వామి శరీరం పెరిగిపోతోంది. ఆంజనేయుడికి భయమూ, తన్మయత్వమూ ఏక కాలంలో కలిగి ''జై చిరంజీవా! జై చిరంజీవా!'' అంటూ అరిచాడు.
''లేవరా నాయనా! నిద్దట్లో కూడా సినిమా పిచ్చేనట్రా?'' అంటూ వాళ్ళమ్మమ్మ లేపేసరికి తను కలగన్నానని తెలుసుకున్నాడు ఆంజనేయులు. అయితేనేం? స్వామి కలలో చేసిన బోధ మాత్రం గుర్తుంది. ఈ రోజు ఎలాగైనా కరోనా బాధితులకు సేవ చేస్తున్న బృందంలో వలంటీర్‌గా చేరాలనుకున్నాడు. తయారై బయలుదేరాడు. అప్రయత్నంగానే అతడి కాళ్ళు ఎర్రజెండాల ఆఫీసు వైపు సాగాయి.
సుబ్రమణ్యం










