న్యాయం కోసం మహిళలు చేసే పోరాటమే తనను ఉత్తేజపర్చిందంటారు జస్టిస్ చంద్రు. ఎమర్జన్సీలో డివైఎఫ్‌ఐ కార్యకర్తగా పని చేస్తున్న కాలంలో నాగమణి అనే మహిళ అందుకు ప్రేరణ అయింది. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం లేని హక్కుల అణచివేత కాలం అది. అయితే ఆ దశలో నాగమణి తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రం దేశం దృష్టికి తేగలిగింది. ఎమర్జన్సీ అత్యాచారాలపై నియమించిన కమిటీ ముందుకు ఆమె కేసు వెళ్లింది. తమిళనాడులో ఒక రిటైర్డు న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేకంగా విచారణ కమిషన్ ఏర్పాటైంది. అక్షరం ముక్క రాని నాగమణి అంత ప్రభావం చూపగలిగినప్పుడు తానెందుకు న్యాయం కోసం పోరాటం చేయొద్దని ఆలోచించిన చంద్రు ఆ మార్గం పట్టారు.
మన మెగా సూపర్ పవర్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని తమళ హీరో దక్షిణాది ప్రముఖ కథానాయకుడు సూర్య, భార్య జ్యోతిక అందించిన 'జై భీమ్' చిత్రం ఇప్పుడు ఓటిటి లో ఒక విభిన్న సంచలనం. జ్ఞానవేల్ దర్శకత్వంలో నిజమైన హీరోయిజం అంటే ఏమిటో, సమాజంలో అన్యాయాలపై పోరాటం అంటే ఏమిటో కొత్త నిర్వచనం ఇస్తున్నది. చిత్రం కథ, నటీనటుల ప్రతిభ, సంభాషణలు సాంకేతిక నైపుణ్యాలతో పాటు ఈ మొత్తానికి ప్రేరణగా నిలిచిన సామాజిక సంఘర్షణ న్యాయ పోరాట చరిత్ర నీరాజనాలు అందుకుంటున్నాయి.
వాస్తవ గాథ, సాహసిక చిత్రణ
బ్రిటిష్ వారి హయాంలోనే అనేక ఆదివాసి వెనకబడిన జాతులపై నిష్కారణంగా నేరస్త ముద్ర వేశారు. స్వాతంత్య్రానంతరం పాలకులూ వాటిని సరిదిద్దలేదు. ఆ విధంగా అణగారిన జాతులు, ఆదివాసులపై అనాగరిక నేరస్త ముద్ర వేసి అయినదానికి కానిదానికి బలితీసే అన్యాయ వ్యవస్థ అమానుషత్వంపై, సిపిఎం నాయకుడు గోవిందన్ తదితరుల సాయంతో సాహసికుడైన న్యాయవాది చేసిన పోరాటం, అంతిమంగా సత్యాన్ని నిరూపించడం ఈ కథ. తమిళనాడు లోని కడలూరు జిల్లా వృద్ధాచల్ పట్టణం పరిసరాల్లో జీవించే ఒక ఆదివాసి తెగ అందై కురుంబర్. ఎన్నో కలలతో జీవితానికో గూడు నిర్మించాలనుకుంటున్న యువ జంట రాజకన్ను, సెంగాని (తెలుగులో రాజయ్య, చిన్నతల్లి) బుట్టలల్లుతూ పొలాల్లో పని చేస్తూ జీవితం సాగిస్తుంటారు. కలుగుల్లో ఎలుకలు, పందికొక్కులు పట్టుకుంటూ వుంటారు. 1993లో రాజకన్ను ఊళ్లో పని లేకపోవడంతో ఏదైనా చేసుకోవాలని పక్క ఊరికెళతాడు. ఆ సమయంలోనే స్వంత ఊరి పెత్తందారు ఇంట్లో బంగారం పోతుంది. రాజకన్నుపై సందేహం వ్యక్తం చేస్తాడు యజమాని. గర్భవతిగా ఉన్న సెంగానిని పోలీసులు హింసిస్తారు. ఆ అమాయకుణ్ని ఘోర చిత్ర హింసలపాలు చేసి ప్రాణాలు తీస్తారు. శవాన్ని కాల్వలో పడేస్తారు. స్టేషన్ నుంచి పారిపోయాడని కథ అల్లుతారు. అక్కడి నుంచి భర్త కోసం సెంగాని అన్వేషణ మొదలవుతుంది. ఈ క్రమంలో సిపిఎం కార్యకర్తలను ఆశ్రయిస్తుంది. అధికారులతో ఎంతగా మాట్లాడినా నిజం చెప్పరు. అప్పుడే న్యాయవాది చంద్రు దగ్గరకు వెళతారు. తను కూడా ఉద్యమాలలో పని చేస్తూ సమాజం కోసం పోరాట్టానికే న్యాయ విద్య అభ్యసించిన వ్యక్తి. అధినేతలు పోలీసుల ఒత్తిళ్లు, వేధింపులు... అన్నిటినీ ఎదుర్కొని 1996 నాటికి తాత్కాలిక ఉత్తర్వులు, సెంగానికి పరిహారం వస్తాయి. సిబిసిఐడి విచారణ తర్వాత మరో పదేళ్లకు అంటే 2006లో పూర్తి తీర్పు వెలువడి పోలీసులకు 14 ఏళ్లు శిక్షలు పడతాయి.
పోలీసు హింసలు, అమాయకులను ఇరికించడం, వివక్షలు వంటివి చూపించిన సిినిమాలు గతంలోనూ వచ్చాయి గాని 'జై భీమ్' ఎలాంటి నాటకీయత లేకుండా సినిమా హైప్‌లు లేకుండా ఇతివృత్తం పైనే కేంద్రీకరించి నడవడం ప్రత్యేకత. సూర్య ఆ పాత్రలో ఎంతో నిగ్రహంతో నటించగా, సెంగానిగా లిజోమల్ జోస్ కష్టమైన ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. మణికంఠన్ రాజకన్నుగా బాగా నటించారు. ప్రకాశ్‌రాజ్, రావు రమేష్ వంటి వారు కూడా చిత్రాన్ని రక్తి కట్టించారు.
అసలైన ప్రేరణ జస్టిస్ చంద్రు
అప్పట్లో లాయర్‌గా పోరాటం చేసిన కె.చంద్రు తర్వాత హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 2006లో మదురై బెంచికి తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేసిన చంద్రు...2009 నుంచి 2013 వరకూ మద్రాసు హైకోర్టులో పని చేసి రిటైరయ్యారు. తన పదవీ కాలంలో ఆయన అనేక ప్రత్యేకతలు సృష్టించారు. 'మిలార్డ్' అన్న పదాన్ని వినియోగించకుండా ఉత్తర్వులు చేశారు. మొత్తం 96,000 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. ఆయన ఇచ్చిన అనేక తీర్పులు సంచలనం సృష్టించాయి. స్త్రీలు అర్చకులుగా వుండవచ్చునన్న తీర్పు వాటిలో కీలకమైంది. మతాల అంతరాలతో బతికింది గాక మరణానంతరం శ్మశానాలు కూడా కులాలు, మతాల వారీగా వుండనవసరం లేదని ఆయన ఒక తీర్పులో చెప్పారు. తన పదవీ కాలంలో పరిష్కరించిన కీలకమైన 20 కేసుల వివరాలతో ''లిజన్ టు మై కేసెస్'' (నా కేసులు వినండి) అన్న పుస్తకం రచించారు. ఇంగ్లీషులో దాన్ని లెఫ్ట్‌వర్డ్ ప్రచురించింది. ఇదే తమిళంలో 'అంబేద్కర్ ఒలియల్ ఎనదు తీర్పుగళ్' (అంబేద్కర్ వెలుగులో నా తీర్పులు) పేరుతో వచ్చింది.
న్యాయం కోసం మహిళలు చేసే పోరాటమే తనను ఉత్తేజపర్చిందంటారు జస్టిస్ చంద్రు. ఎమర్జన్సీలో డివైఎఫ్‌ఐ కార్యకర్తగా పని చేస్తున్న కాలంలో నాగమణి అనే మహిళ అందుకు ప్రేరణ అయింది. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం లేని హక్కుల అణచివేత కాలం అది. అయితే ఆ దశలో నాగమణి తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రం దేశం దృష్టికి తేగలిగింది. ఎమర్జన్సీ అత్యాచారాలపై నియమించిన కమిటీ ముందుకు ఆమె కేసు వెళ్లింది. తమిళనాడులో ఒక రిటైర్డు న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేకంగా విచారణ కమిషన్ ఏర్పాటైంది. అక్షరం ముక్క రాని నాగమణి అంత ప్రభావం చూపగలిగినప్పుడు తానెందుకు న్యాయం కోసం పోరాటం చేయొద్దని ఆలోచించిన చంద్రు ఆ మార్గం పట్టారు. మన దేశంలో మహిళలు కోర్టులకు వెళ్లి పోరాటం మరింత కష్టమనేది ఆయన అభిప్రాయం. అనుభవం. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. వారికి న్యాయం జరిగేలా చేయడానికి కావలసిన భాష కూడా ఇంతవరకూ ఏర్పడలేదంటారు. పాండ్యన్ అనే ట్రాన్స్‌జెండర్ పై సోదరి కేసు వేసింది. ఈ కేసులో తీర్పు రాయడానికి పాండ్యన్‌ను ఏమనాలి? అనివార్యంగా అయిష్టంగా 'అతను' అని రాయాల్సి వచ్చినందుకు ఎంతో బాధ పడ్డానంటారు. మరో కేసులో ఒక మహిళను మతి స్థిమితం లేదని ఉద్యోగం నుంచి తొలగించారు. చంద్రు ఆ కేసు విషయంలో లోతుగా కృషి చేశారు. ఆమెకు న్యాయం చేయడం కోసం మానసిక వైద్య పరీక్ష చేసుకోమని కోరారు.అయితే ఆ మహిళ అందుకు ఇష్టపడలేదు. ఆయనే ఎలాగో నచ్చజెప్పి పరీక్షలు జరిపించారు. శారీరక అస్వస్తత ఎలాంటిదో మానసిక అస్వస్తత కూడా అలాంటిదేనని దానికి గాను వారిని పని నుంచి తొలగించడం వంటి శిక్షలు వేయడం అన్యాయమని చెప్పారు. ఈ కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది గాని అప్పటికే ఆమె చనిపోవడం ఆయనకు ఎంతో బాధ కలిగించిన విషయం.
శ్రమ జీవులు, ఆదివాసులు, దళితులు, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా మన చట్టాలు, వ్యవస్థ ఎలా పని చేస్తాయో ఆయన ప్రత్యక్షంగా చూశారు. అన్యాయం జరిగినా అందుకు సంబంధించిన వాస్తవ నిబంధనలు ఏమిటో, ఎలా ఉల్లంఘించబడ్డాయో, ఎలా చెబితే కోర్టు ముందు నిలుస్తుందో వారికి తెలియదు. ఆ హడావుడిలో, బాధలో క్రాస్ ఎగ్జామినేషన్ ఒత్తిడిలో, లాయర్ల అనవసర సలహాలతో తమకు నష్టం కలిగించేలా కూడా మాట్లాడవచ్చు. అందుకే 'జై భీమ్'లో సెంగాని తన దగ్గరకు వచ్చినప్పుడు చంద్రు జరిగింది జరిగినట్టు చెప్పమని అడుగుతాడు. దాన్ని తమిళంలోనే రాసుకుని ఆమెను మళ్లీ అడిగి నిర్ధారించుకుంటాడు. తర్వాతనే ఇంగ్లీషులో రాసుకోవడం. వున్నది వున్నట్టు అనేది ఇక్కడ సూత్రం. న్యాయం తప్పక జరుగుతుందని చెప్పడం నిజమే గాని దాన్ని సాధించేందుకు పోరాటం చాలా నేర్పుతో ఓర్పుతో నైపుణ్యంతో చేయాలంటారు. చట్టం వ్యవస్థపై ఆధారపడి వుంది గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి లేదన్నది కారల్ మార్క్స్ ప్రసిద్ధ వాక్యం. ప్రజా పోరాట కార్యకర్తగా హక్కుల న్యాయవాదిగా ఉన్నత న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రు జీవితం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఆ రోజుల్లో ఆయన నిరుపేదల దగ్గర రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా వాదించేవారట. న్యాయమూర్తిగా తన పదవీ కాలం చివరి రోజున మీడియాను పిలిచి మాట్లాడారు. తాను సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేయబోననీ, ఏ ట్రైబ్యునల్ లోనూ పదవి తీసుకోబోననీ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తులే రాజ్యసభలకూ ఇతర పదవులకు ఎగబడే కాలంలో ఇది అరుదైన ఆదర్శం! 'జై భీమ్' విడుదలైన తర్వాత మీడియా సంస్థలలో జస్టిస్ చంద్రు ఇంటర్వ్యూలు విస్తారంగా వస్తున్నాయి. సోషల్ మీడియా ఆయనను ఒక హీరోగా అభినందిస్తున్నది. భారత రత్న ఇవ్వాలని కూడా అనేకమంది అంటున్నారు. అన్నట్టు జస్టిస్ చంద్రు విజయవాడ, హైదరాబాద్‌లతో సహా తెలుగు నగరాల్లోనూ పర్యటించారు. ఐలూ సభలకు విచ్చేశారు. చాలా నిరాడంబరుడు. ఈ వ్యాసకర్త ఆయన ప్రసంగాలను అనువదించారు కూడా.
తెరపై సామాజిక న్యాయ పవనాలు
తమిళనాడులో కమ్యూనిస్టు ఉద్యమం మొదటి నుంచి గ్రామాలలో కుల వివక్షపైన పెత్తందార్ల దౌర్జన్యాలపైన పోరాడుతోంది. ఇటీవలనే తెలుగులో వచ్చిన నారప్ప చిత్రం (తమిళంలో అసురన్) అయిదున్నర దశాబ్దాల కింద కీలవెన్మణిలో దళితులను సజీవ దహనం చేసిన సంఘటనకు చిత్రరూపమే. అది కూడా సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలను అణచివేసేందుకే జరిగింది. ద్రవిడ భావజాలం, బ్రాహ్మణేతర ఉద్యమం తర్వాత కాలంలో వెనకబడిన కులాల పోరాటం వంటివి దీన్ని మరింత పదునెక్కించాయి. తెలుగు రాష్ట్రాలలో కెవిపిఎస్ లాగే తమిళనాడులో అస్పృశ్యతా నిరోధక సంఘం పనిచేస్తున్నది. ఇప్పటికీ రాష్ట్రంలో ఏదో మూల వివక్షపై పోరాటం కథలు వింటూనే వుంటాం. ఏవో కొద్ది మినహాయింపులు తప్ప మామూలుగా మన సినిమాలలో పేద ధనిక తేడాలు చూపినంతగా కుల వివక్షనూ కింది కులాల పేర్లనూ వినం. దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు కూడా మూల పీఠమైన మద్రాసులో రజనీకాంత్ లాంటి మాస్ హీరో కూడా పా రంజిత్ నిర్దేశకత్వంలో 'కబాలి, కాలా' వంటి చిత్రాలలో ఉపేక్షిత వర్గాల (సబ్ అల్ట్రన్) కథలను తీసుకోవలసిన పరిస్థితి రావడం గమనించదగింది. మాస్ మసాలాకు ఫార్ములా కథలకు పేరు మోసిన తెలుగులోనూ 'రంగస్థలం'తో మొదలుపెట్టి ఈ తరహా కథలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తీరులో తేడాలున్నా ఈమధ్య కాలంలో 'కలర్ ఫోటో, ఊపిరి, లవ్‌స్టోరీ' వంటి చిన్న పెద్ద చిత్రాలు కుల సమస్యను తీసుకోవడం యాదృచ్ఛికం కాదు. పాతికేళ్ల కిందటే ఆదివాసులపై పోలీసు దౌర్జన్యం, మిస్సింగ్ కేసును తీసి జాతీయ అవార్డు సాధించిన సి. ఉమా మహేశ్వరరావు, ఈమధ్య 'ఇట్లు అమ్మ' చిత్రంలో ఇలాంటి అంశాన్ని మరో కోణంలో చూపించడం గమనించదగ్గది. మీడియాలో సోషల్ మీడియా లాగా సినిమాలకు ఓటిటి (ఓవర్ ది టాప్) సమాంతర ప్రయత్నాలకు దోహదం చేస్తున్నది. 'జై భీమ్' ఈ కోవలో మైలురాయి వంటి ప్రయత్నం. మహిళల సమస్య పైనే వచ్చిన 'పింక్'ను తెలుగులో 'వకీల్ సాబ్'గా తీసిన తీరుకూ, 'జై భీమ్' కూ తేడాను విమర్శకులు చెప్పుకోవడమే గాక ప్రేక్షకులూ గమనించారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి చారిత్రక పాత్రలకు కూడా లేని పోని కల్పనలు జోడించి భారీ వాణిజ్య చిత్రాలుగా తీసే కాలంలో అతి సామాన్యులతో కలసి అభ్యుదయ శక్తులు సాధించిన విజయం 'జై భీమ్' అంటూ ముందుకు రావడం ఎంత గొప్ప విషయం !
తెలకపల్లి రవి











