Aug 22,2023 21:38

ఎంపిడిఒ కార్యాలయం బయట బైటాయించిన కార్మికులు, నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జాయింట్‌ కమిటీ సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించాలన్న జిల్లా అధికారుల ప్రయత్నాన్ని సిఐటియు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్మికులు అడ్డుకున్నారు. సమావేశాన్ని బహిష్కరించారు. మంగళవారం పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని 32 మండలాల పంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛభారత్‌ కార్మికులు, సిఐటియు నాయకులతో జాయింట్‌ కమిటీ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గత రెండు మూడు సంవత్సరాల నుండి స్వచ్ఛభారత్‌ కార్మికులకు వేతనాలు అందలేదని దానికి తోడు పలు డిమాండ్లతో గత నెలలో రెండుసార్లు స్వచ్ఛభారత్‌ కార్మికులు జిల్లా కలెక్టరేేట్‌, డిపిఒ కార్యాలయాల ముట్టడి చేశారు. ఆ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ డిపిఒ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన పుట్టపర్తిలో జాయింట్‌ కమిటీ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దాంతో శాంతించిన కార్మికులు యధావిధిగా విధుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన జాయింట్‌ కమిటీ సమావేశం కార్మికుల సమస్యలు చర్చించడానికి డిఎల్‌పిఒ, పుట్టపర్తి ఈవో ఆధ్వర్యంలో జిల్లాలోని 32 మండలాల కార్యదర్శిలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌, డిపిఒ హాజరు కాలేదు. ఇది గ్రహించిన సిఐటియు నాయకులు, స్వచ్ఛభారత్‌ కార్మికులు సమావేశానికి హాజరు కాకుండా సమావేశ మందిర ముందు బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఏపీ గ్రామపంచాయతీ నౌకర్ల సంఘం అధ్యక్షులు సజ్జరాయప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌, మున్సిపల్‌ కార్మికుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక కమిటీ సభ్యులు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌, సిఐటియు బాబావలి,స్వచ్ఛభారత్‌ కార్మికులు బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. సమావేశ మందిరంలో ఉన్న వారిని బయటికి రానివ్వకుండా బయట ఉన్న వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా రెండు గంటల పాటు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నారు. దీంతో లోపల ఉన్న అధికారులు ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఫిరంగి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లా సమావేశం ఏర్పాటు చేసి కనీస వసతులు కూడా కల్పించలేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్యదర్శిలకు కుర్చీలు కూడా లేవని నీటి వసతి కల్పించకుండా ఏర్పాటు చేసిన ఇదేమి సమావేశమని ప్రశ్నించారు. సమావేశానికి పిలిపించి అవమానించారని అందువలన ఈ జాయింట్‌ కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపి కార్యాలయం నుండి బయటకు వచ్చారు. తమ సమస్యలను తీర్చకపోతే వారంలోపు ప్రజా సంఘాలతో చర్చించి సమ్మెకు వెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వచ్ఛభారత్‌ కార్మికులు పాల్గొన్నారు.