
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పైడితల్లమ్మ సిరిమాను జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాముల నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ట్యాంక్‌బండ్ రోడ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించాలని సిబ్బందికి ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వివాహన చోధకులకు అవసరమైన పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి వాటిని చదును చేసే ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేయాలని చెప్పారు. బొంకులదిబ్బ ప్రాంతంలో సురభి నాటక ప్రదర్శనలు జరగనున్న నేపథ్యంలో సభాస్థలిని చదును చేయాలని సూచించారు. పైడితల్లమ్మ దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, ఎక్కడా అపరిశుభ్ర వాతావరణ లేకుండా సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. జాతర ప్రాంతాల్లో పారిశుధ్యానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఇఇ దక్షిణామూర్తి, పారిశుధ్య పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.