Sep 12,2023 23:33

ప్రజాశక్తి - పంగులూరు
నవంబరు నెల 22 నుండి 26వరకు అస్సాం రాష్ట్రం గౌహతి పట్టణంలో జరిగే జాతీయ స్థాయి యోగా పోటీలకు మండలంలోని చందలూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల 6వ తరగతి చదువుతున్న, నాయపాము శృతి ఎంపికయింది. 10-12 సంవత్సరాల విభాగంలో ఈ నెల9, 10తేదీలలో కర్నూలులో జరిగిన 48వ రాష్ట్రస్థాయి యోగ పోటీలలో నాయపాము శృతి ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు స్థానం సంపాదించింది. అంతకుముందు ఆగస్టు నెల 20న ప్రకాశం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని యోగా పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో రాష్ట్రస్థాయికి అర్హత సాధించి కర్నూలులో పాల్గొన్నారు. అక్కడి పోటీల్లో జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ఇదే పాఠశాలకు చెందిన ఎన్ హాసిని 12 -14 సంవత్సరాల కేటగిరిలో ఐదవ స్థానం సాధించింది. ఈ పాఠశాల నుండి కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి యోగ పోటీలకు 10- 12 సంవత్సరాల విభాగంలో బాలికలలో నాయపాము శృతి, బాలురలో ఎం వెంకటేష్, 12 - 14 సంవత్సరాల విభాగంలో ఎన్ సుప్రియ, ఎన్ హాసిని పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి యోగ పోటీలలో పాల్గొని విశేషమైన ప్రతిభను కనపరిచి, జాతీయస్థాయి యోగ పోటీలకు ఎంపికైన నాయపాము శృతిని, ఐదవ స్థానం సాధించిన హాసినిని, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎస్ఏ (పిఈ), కె ప్రతిమను పాఠశాల హెచ్‌ఎం చందలూరు గిరిజ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అడ్డగడ్డ సుబ్బయ్య, పెండ్యాల రామలింగస్వామి, వడ్డవల్లి వీరనారాయణ, బెల్లంకొండ దశరథ పాల్గొన్నారు.