ప్రజాశక్తి-పర్చూరు: ఎన్‌టిఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పర్చూరు వేదికగా జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో ఏలూరి యూత్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ టి-20 క్రికెట్ ఇండియా లెవెల్ టోర్నమెంటు ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు పర్చూరులో జరుగుతాయి. ఈ పోటీలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దామచర్ల సత్య, తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి కొండయ్య ప్రారంభించారు. తొలుత పర్చూరు బొమ్మల సెంటర్‌లో ఎన్‌టిఆర్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహాలకు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాతా జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర కార్యదర్శులు సలగల రాజశేఖర్, దాసరి ఉషారాణి, దేవతోటి నాగరాజులతో కలిసి దామచర్ల సత్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ మోటారు సైకిల్ ర్యాలి నిర్వహించారు. వై జంక్షన్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏలూరి అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
పోటీలను ప్రారంభించిన సత్య
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలను పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, చీరాల ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య ప్రారంభించారు. తొలి పోటీలలో ఎస్‌డబ్ల్యుసిసి తిరుపతి, ప్రభు లెవెల్ బ్రదర్స్ కామారెడ్డి జట్లు పోటీపడ్డాయి. పోలీసు లెవెన్ వర్సెస్ గుంటూరు, మలినేని గుంటూరు జట్ల మధ్య పోటీ జరిగింది. కార్యక్రమంలో ఏలూరి యూత్ నిర్వాహకులు తులసి శ్రీనివాసరావు, మామిడిపాక హరిప్రసాద్, చింపయ్య, మండల పార్టీ అధ్యక్షులు షంషుద్దీన్, నాగేశ్వరరావు, నాయుడు హనుమంతరావు, కృష్ణారావు, హరిబాబు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.










