జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించిన ఎంఎల్‌ఎ ప్రతాప్
ప్రజాశక్తి - నూజివీడు
నూజివీడు నుండి క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించి విజేతలుగా ఎదగాలని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. పట్టణంలోని ధర్మ అప్పారావు కళాశాల ఆవరణలో మంగళవారం జగనన్న క్రీడా సంబరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి చదువుతోపాటు క్రీడల పట్ల ప్రతిభ కనపరచాలన్నారు. ప్రస్తుతం నూజివీడులో నిర్వహిస్తున్న కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లలో గెలుపొంది జిల్లా, రాష్ట్ర స్థాయిలను అధిగమించి జాతీయస్థాయిలో విజేతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలతో మానసికోల్లాసంతోపాటు ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ యువత ఒక్క క్రికెట్ పట్లే కాక వాలీబాల్, కబడ్డీల్లో ప్రతిభ కనబరిచి నూజివీడు పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని కోరారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు.










