జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు కేసీ తేజేష్
అభినందించిన క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా
ప్రజాశక్తి- నగరి
స్థానికంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి మంత్రి ఆర్కేరోజా తరచూ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాలు, పోటీలు నిర్వహిస్తూ అందిస్తున్న సహకారం వారు క్రీడల్లో ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడుతోంది. ఇటీవల నంద్యాల జిల్లా మహానందిలో నిర్వహించిన సబ్‌జూనియర్ బాల్‌బాడ్మింటన్ పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ చూపగా అందులో నగరి పట్టణానికి చెందిన వశిష్ట విద్యాలయ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కెసి తేజేష్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మంగళవారం తన నివాస కార్యాలయం వద్ద జిల్లాటీం క్రీడాకారులను, జాతీయ పోటీలకు ఎంపికైన కేసీ తేజేష్‌ను మంత్రి రోజా అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ గోపి మాట్లాడుతూ జిల్లా నుంచి అంతర్‌రాష్ట్ర పోటీలకు వెళ్లిన టీం బాగా రాణించిందని మంత్రికి తెలియపరిచారు. జిల్లా టీంలో ప్రతిభ చూపిన కేసీ తేజేష్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు ఛత్తీష్‌గడ్ రాష్ట్ర బిలారు, బీఎస్‌పీ బాల్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ క్యాంపస్‌లో జరిగే జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గోనున్నాడన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని దాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడాకారులు రాణించాలని అన్నారు. పీఈటీ పాండియన్, జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఇగ్జాజ్‌అహ్మద్, భానుప్రకాష్, లక్ష్మీ నరసింహారెడ్డి, రక్షణ్ పాల్గొన్నారు.










