ప్రజాశక్తి-గుంటూరు : పిల్లలను వారికి ఆసక్తి ఉన్న ఆటల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. గుంటూరు నగరం నుండి జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను శుక్రవారం కమిషనర్ ఛాంబర్‌లో కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. స్కేటింగ్ కోచ్‌లు ఇమ్రాన్, అప్సర్‌ను అభినందించారు. ఈనెల 14న నగరంలోని బిఆర్ స్టేడియంలో జరిగిన ఐస్ స్కేటింగ్ నేషనల్ సెలక్షన్ పోటీల్లో గుంటూరు నగరానికి చెందిన ఐకెఎస్‌ఏ స్కేటింగ్ అకాడమి క్రీడాకారులు 1 బంగారు, 5 వెండి, 2 కాంశ్య పతకాలు సాధించి డిశంబర్‌లో గుర్గావ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. గుంటూరు నగరంలోని పార్కుల్లో పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామని, త్వరలో గుంటూరులో స్కేటింగ్ రింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు.
స్కేటర్లను అభినందిస్తున్న కమిషనర్