75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడుగునా జరిపే 'ఆజాదీ కా అమృతోత్సవ్'లో భాగంగా భారత చారిత్రిక పరిశోధనా మండలి (ఐసిహెచ్‌ఆర్) విడుదలజేసిన పోస్టర్‌లో జవహర్ లాల్ నెహ్రూ బొమ్మను తొలగించడం చరిత్రను మకిలిపట్టించడమే. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చరిత్రను తిరగరాసేందుకు పన్నని కుతంత్రం లేదు. లేని చరిత్రను సృష్టించడం కోసం బిజెపి/ఆరెస్సెస్‌లు ఐసిహెచ్‌ఆర్‌ను నిర్లజ్జగా దుర్వినియోగపరుస్తున్నాయి. నకిలీ నాణేలను ముద్రించి చరిత్రను తప్పుదోవ పట్టించేందుకు మోడీ ప్రభుత్వం ఇంతకుముందు ఒకసారి ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా జాతీయోద్యమ ప్రముఖులు, భారత దేశ తొలి ప్రధాని నెహ్రూను పోస్టర్ నుంచి ఏకంగా తొలగించివేయడం సంఫ్‌ు పరివార్ విద్వేష రాజకీయాలకు పరాకాష్ట. వివిధ రాజ్యాంగసంస్థల్లో ఆరెస్సెస్ మనుషులను చొప్పించి వాటి స్వతంత్రను దెబ్బతీసిన మోడీ ప్రభుత్వం ఐసిహెచ్‌ఆర్‌ను కూడా భ్రష్టు పట్టిస్తున్నది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధీనంలోని ఈ సంస్థ తీసుకున్న మతిమాలిన చర్యను రాజకీయ పార్టీలు, చరిత్రకారులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు తీవ్రంగా ఖండించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జాతిపిత మహాత్మ గాంధీని కాల్చి చంపిన ఫాసిస్టు సంఫ్‌ుపరివార్ ఆధునిక భారత దేశ నిర్మాత నెహ్రూ పట్ల తన విద్వేషాన్ని ఎన్నడూ దాచుకోలేదు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ మాదిరిగానే భారత్‌ను మత రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఈ శక్తులు కలలు కన్నాయి. నెహ్రూ దీనిని గట్టిగా వ్యతిరేకించాడు. భారత్ మరో పాకిస్తాన్‌లా మారకూడదని వాదించాడు. విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులతో కూడిన భారత్‌ను ఆధునిక, లౌకిక, ప్రజాతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. భారత దేశ సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణకు పూనుకున్నాడు. బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో పాల్గొని తొమ్మిదేళ్లు జైలు జీవితం అనుభవించాడు. దేశానికి పదిహేడేళ్ల పాటు ప్రధానిగా సేవలందించాడు. అటువంటి మహోన్నత వ్యక్తిని కించపరిచేందుకు యత్నించడం అత్యంత గర్హనీయం. జాతీయోద్యమ నేతను అవమానించే అల్పిష్టులు కేంద్రంలో అధికారం చలాయించడం ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అంతకన్నా దౌర్భాగ్యమేమిటంటే భారత స్వాతంత్య్రోద్యమానికి ద్రోహం చేసి, బ్రిటిష్ వారిని క్షమాభిక్ష ప్రసాదించమని దేబిరించిన హిందూ మహాసభ నాయకుడు వి.డి సావర్కర్ ఫొటోను పోస్టర్‌లో గాంధీ ఫొటోలతో పాటు ప్రదర్శించడం. వట్టి పిరికిపంద అయిన సావర్కర్‌కు 'వీర్' అని బిరుదు తగిలించి ఆకాశానికెత్తడం బిజెపి, ఆరెస్సెస్‌లకే చెల్లింది. గాంధీజీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన సావర్కర్‌ను జాతీయోద్యమ నేతగా చిత్రించడం అత్యంత హాస్యాస్పదం. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని సంఫ్‌ు పరివార్‌కు ఉన్న చరిత్రంతా ఒక్కటే. కీలకమైన సందర్భాల్లో బ్రిటిష్‌వారికి ఏజెంట్లుగా వ్యవహరించడం. ఇవన్నీ దాచేస్తే దాగని చారిత్రిక సత్యాలు. అందుకే చరిత్రను, చారిత్రిక ఆనవాళ్లను వీలుంటే తుడిచేయాలని, అది సాధ్యం కాకుంటే వక్రీకరించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి, అలాగే ఉన్నత స్థానాల్లో వారు నియమించిన అగ్ర వర్ణ భూస్వాములకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున సాగిన మలబార్ ఉద్యమానికి మతం రంగు పులిమేందుకు బిజెపి యత్నించడం జుగుప్స కలిగిస్తోంది. స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఉన్న మలబార్ పోరాటాన్ని మతతత్వ శక్తుల తిరుగుబాటుగా చిత్రీకరించేందుకు బిజెపి యత్నించడం దుర్మార్గం.
ఆజాదీకా అమృతోత్సవ్ పోస్టర్‌లో నెహ్రూను తొలగించడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తరువాతి పోస్టర్‌లో నెహ్రూ ఫోటో కూడా ఉంటుందని ఎన్‌హెచ్‌ఆర్‌సి సన్నాయి నొక్కులు నొక్కుతోంది. 'గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' వంటి బహుళ ప్రాచుర్యం పొందిన పుస్తకాలు రాసిన నెహ్రూను రెండో పోస్టర్‌లో వేస్తామని అనడం అత్యంత శోచనీయం. స్వతంత్ర భారతావని తొలి ప్రధాని ఫొటో లేకుండా పోస్టర్ విడుదల చేసినందుకు మోడీ ప్రజలను క్షమాపణ కోరాలి.










