Sep 13,2023 20:33

ఢిల్లీలో ధర్నా చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

కడప అర్బన్‌ : దేశ విద్యా విధానానికి నష్టాన్ని చేకూర్చే జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు ఎస్‌.కె.జాబీర్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ హక్కుల్ని కాపాడే పాత పెన్షన్‌ను పునర్దించాలని డిమాండ్‌ చేస్తూ ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ అండ్‌ కాలేజీ, టీచర్స్‌ ఆర్గనైజేషన్‌, జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ మూవ్మెంట్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జంత ర్మంతర్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్లకు లాభం చేకూర్చే ప్రైవేటీకరణకు దారి తీసే విద్య మొత్తం వ్యాపారమయం చేసే జాతీయ విద్యా విధానం వల్ల తీవ్ర నష్టమని, భవిష్యత్తులో కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల హక్కుగా ఉన్న పెన్షన్‌ని బిక్షగా మార్చి నూతన పెన్షన్‌ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల హక్కుల్ని అందించే విధా నాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్లకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పేరు పెట్టినా పాత పెన్షన్‌ విధానానికి సాటి రావని పేర్కొన్నారు. వెంటనే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ మొత్తాన్ని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి పరీక్షల విధానం పేరుతో రాష్ట్ర హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న రాజ్యాంగబద్ధ హక్కులను ఇవ్వాలన్నారు. నీట్‌ లాంటి పరీక్షలు రద్దు చేయాలన్నారు. విద్యను,యూనివర్సిటీ లను,జాతిని ప్రవేటికరణ నుంచి రక్షించాలని డిమాండ్‌ చేశారు.