Aug 19,2023 17:25

గురువుతో పరుగు పందెం పోటీలకు ఎంపికైన సిద్ధార్థ

ప్రజాశక్తి-పీలేరు: ఇంటి పేరు 'గుర్రం' పరుగులో 'వేగం' అదే పీలేరు కుర్రాడు గుర్రం సిద్ధార్థ 'తేజం'. పీలేరు మండలంలోని దొడ్డిపల్లి పంచాయతీకి చెందిన గుర్రం నారాయణ కుమారుడు గుర్రం సిద్ధార్థ పరుగు పందెంలో తన సత్తా చాటుతూ ఇంటి పేరును సార్థకం చేసుకుంటున్నాడు. మదనపల్లి జవహర్‌ నవోదయా విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దక్షిణ భారత స్థాయిలో ఇటీవల నవోదయ విద్యాలయ సమితి జరిపిన స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ పోటీల్లో గుర్రం సిద్ధార్థ పాల్గొని 100, 200 మీటర్లు పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈనెల 24 నుండి 26 వరకు గుజరాత్‌ రాష్ట్రం, నడియాడ్‌ లో జరిగే జాతీయస్థాయి పరుగు పందేనికి సిద్ధమౌతున్నాడు. ఈ సందఠంగా గుర్రం సిద్ధార్థ మాట్లాడుతూ పరుగు పందెంలో తాను రాణించడానికి తన వ్యాయామ ఉపాధ్యాయులు జి. సురేంద్ర రెడ్డి అందిస్తూన్న ప్రోత్సాహమే మొదటి కారణమని అంటున్నాడు. ఆయన శిక్షణలోనే తాను జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తన ఇంటిపేరు ''గుర్రం'' కావడంతో పరుగు పందెంలోనూ 'రేసుగుర్రం' లాగా దూసుకుపోతూ తన ఇంటి పేరును నిలబెట్టుకుంటున్నాడని సిద్ధార్థ తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి గుర్రం నారాయణ గత 25 సంవత్సరాల నుండి దళిత ఉద్యమ నేతగా, సామాజిక కార్యకర్తగా, తల్లి వనజాక్షి ప్రథమ చికిత్స కేంద్రం నిర్వహిస్తున్నారు.