Aug 11,2023 21:42

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
             ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, వాటి నిర్మాణాలపై ఆసక్తిని కలిగించేందుకు దేశవ్యాప్తంగా ఫార్ములా ఆఫ్‌ రోడ్‌ మినీ బజా ఇండియా (ఎఫ్‌ఒఎంబిఐ) పేరిట ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇసుని మోటార్‌ స్పోర్ట్స్‌ సంస్థ, భోపాల్‌కు చెందిన సాగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో కలిసిసంయుక్తంగా జాతీయస్థాయిలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచి కప్పు సాధించారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు చెప్పారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ హెడ్‌ డాక్టర్‌ పి.రామ్మూర్తిరాజు మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన రెండు, మూడు, నాలుగో సంవత్సరానికి చెందిన 28 మంది విద్యార్థులు ఒక గ్రూపుగా తయారై జీప్‌ తరహాలో ఉండే ఎటివి వాహనాన్ని రూపొందించారు. కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వివి.మురళీకృష్ణమరాజు, యు.రాజేంద్రవర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. కళాశాల పాలకవర్గ సభ్యులు సాగి సత్య ప్రతీక్‌ వర్మ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అన్ని విభాగాల్లో నైపుణ్యం సంపాదించడమే కాకుండా విద్యార్థులకు కోరు గ్రూపులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.