ప్రజాశక్తి-రాజవొమ్మంగి
నెల్లూరు అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో రాజవొమ్మంగి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 3వేల విద్యార్థులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి జిల్లా పరిషత్ పాఠశాల నుండి 45 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో ఆరుగురు విద్యార్థులు బాల చిత్ర కళాశ్రీ అవార్డుతో బంగారు పతకాలు సాధించారు. ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న టి.హారిక, హనీప్రియ, కామేశ్వరి, ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రీదుర్గా, తొమ్మిదో తరగతి చదువుతున్న వీరలక్ష్మి, పదోతరగతి చదువుతున్న అపర్ణ బాల చిత్ర కళాశ్రీ సర్టిఫికెట్, బంగారు పతకాలు సాధించారు. వీరికి తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయుడు మిరియాల కొండబాబుకు అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఆర్ట్స్ గురు బిరుదు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పాఠశాలలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేసి పతకాలు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయుడు మిరియాల కొండబాబును పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, పిఎంసి కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్‌వివిఎస్.మూర్తి, అర్జమ్మ, రాజబాబు, బాబురావు దొర, శ్రీను, సన్యాసమ్మ, కొండబాబు, నాగరాజు, లోవరాజు, లోవయ్య తదితరులు పాల్గొన్నారు.










