ప్రజాశక్తి - పాలకొండ రూరల్ : మండలంలోని చినమంగళాపురంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు సోమవారం పరిశీలించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బృందం ఆరోగ్య సూచికలపై సర్వే నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా రక్తపోటు, మధుమేహం, వివాహ వయస్సు, సార్వజనీన టీకా కార్యక్రమం, ఆసుపత్రుల్లో ప్రసవాలు, 23 నెలల్లోపు చిన్నారుల బరువు, 24 నెలల నుంచి 71 నెలల లోపు చిన్నారుల బరువు, ఎత్తు, ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై బృందం సర్వే చేపడుతోందని, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వివరించారు.
వెల్ నెస్ సెంటర్ తనిఖీ.....
అనంతరం చిన మంగళాపురం వెల్‌నెస్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు. మందుల, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. అవసరమైన అందరికీ మందులు అందించాలని ఆదేశించారు. మందుల కొరత లేదని స్పష్టం చేశారు. గర్భిణుల టెస్టింగ్ కిట్లతో సహా అందుబాటులో ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించి గ్రామస్తులకు మంచి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. వెల్‌నెస్ సెంటర్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, మందులను క్రమపద్ధతిలో పేర్చాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట స్థానిక వైద్య అధికారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.










