Mar 17,2023 23:41

బుదరలో కూరుకుపోయిన బస్సును తోస్తున్న ప్రయాణికులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలో 516ఇ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా, గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఈ మార్గంలో రాకపోకలకు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వేసిన మట్టి వర్షం కారణంగా బురదగా మారింది. దీంతో దూసరపాము, తంటికొండ, సింగంపల్లి, జడ్డంగి తదితర ప్రాంతాల్లో వాహనదారులు శుక్రవారం రాకపోకలు సాగించే సమయంలో ప్రమాదాలకు గురయ్యారు. వాహనాల్లో మట్టి ఇరుక్కు పోవడంతో వాహనాలు ముందుకు నడవక నానా అవస్థలు పడ్డారు. ద్విచక్ర వాహనదారులు అనేకమంది వాహనదారులు ఈ రహదారిలో పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారి ప్రయాణం మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సులు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలను తోయవలసిన పరిస్థితి ఏర్పడింది, వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందుల నేపథ్యంలో సంబంధిత సిబ్బంది తక్షణం డైవర్సన్‌ ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం మండల నాయకులు కొండ్ల సూరిబాబు, జె.రాజు, పాపారావు, సత్యనారాయణ తదితరులు డిమాండ్‌ చేశారు.