Nov 01,2023 23:03

ప్రజాశక్తి - భట్టిప్రోలు
ప్రకాశం జిల్లా త్రోవగుంట నుండి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి వరకు నిర్మించిన 216జాతీయ రహదారిపై నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రహదారి పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు సిద్ధం కాలేదు. భట్టిప్రోలు సమీపంలోని సురేపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఈ రహదారిలో అనుమతి లేకుండా ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. బ్రిజ్జి నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా మండలంలోని కన్నెగంటి వారి పాలెం, వరికూటివారిపాలెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై రాకపోకలకు అడ్డుగా రహదారి నిర్మాణదారులు లారీలు కొద్ది మట్టిని అడ్డు పోశారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు పెనుమూడి మీదగా కృష్ణా జిల్లా వెళ్లేందుకు దగ్గర మార్గంగా ఈ జాతీయ రహదారిపైనే ప్రయాణిస్తున్నారు. అడ్డుగా పోసిన మట్టిపై వాహనం ఎక్కి దిగే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారి పనులు పూర్తి కాలేదని, వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు అడ్డుకట్ట వేసినప్పటికీ ఎవరికివారు ఇదే రహదారిపై ప్రయాణించే క్రమంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ రాకపోకలు మాత్రం ఆగటం లేదు. బుధవారం ఉదయం అడ్డు పోసిన మట్టిపై ఎక్కి దిగుతున్న లారీని గమనించని ఓ ఒకరు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. రహదా నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎలాంటి వాహనాల రాకపోకలు జరగరాదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.