ప్రజాశక్తి-చెరుకుపల్లి: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢకొీనడంతో 17 రోజులుగా చికిత్స పొంది నాలుగు ఆపరేషన్లు నిర్వహించినా, మహిళ మృతి చెందడంతో నడింపల్లి ఎస్సీ కాలనీ వాసులు బాధిత కుటుంబానికి న్యాయం చేయా లంటూ మృతదేహంతో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో జరిగింది. వివరాల మేరకు.. నడింపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గుమ్మడి నిర్మల(47) ఆగస్టు రెండో తేదీన రోడ్డుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఒక యువకుడి ద్విచక్ర వాహనం ఆమెను ఢకొీనడంతో తీవ్ర గాయాల పాలయింది. ఈ మేరకు చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిర్మల నడుము కింద భాగంలో తీవ్ర గాయాల పాలవడంతో ఆమెకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు సర్జరీలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ ఆమె మృతి చెందడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీవాసులు, గ్రామస్తు లు, బంధువులు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. రేపల్లె రూరల్ సీఐ ఏ శివశంకర్, ఎస్‌ఐ వై సురేష్, సిబ్బంది బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు.










