May 12,2023 23:16

బైక్‌ను ఢకొీట్టిన కారు
రిటైర్డ్‌ వెటర్నరీ అసిస్టెంట్‌ మృతి
కారు ఎంపీ భరత్‌రామ్‌దిగా ప్రచారం
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌

                16వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిని దాటుతున్న సమయంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢకొీన్న ప్రమాదంలో భీమడోలుకు చెందిన రిటైర్డ్‌ వెటర్నరీ అసిస్టెంట్‌ శృంగవృక్షం నరసయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామవరానికి చెందిన నరసయ్య కొన్నేళ్ల నుంచి భీమడోలులో ఉంటున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇరువురికి వివాహాలు అయ్యాయి. నరసయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం భీమడోలు నుంచి బైక్‌పై సీతంపేట బయలుదేరారు. ఈ క్రమంలో దెందులూరు మండలంలోని కొత్తగూడెం రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపుగా వెళ్తున్న కారు ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో భీమడోలు, శ్రీరామవరం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
కారు ఎంపీ భరత్‌రామ్‌దిగా ప్రచారం
ప్రమాదానికి కారణమైన కారు రాజమండ్రి ఎంపీ భరత్‌రామ్‌దిగా ప్రచారం సాగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కారులోనే ఉన్నారని కొందరు, వెనుక కారులో ఉన్నారని కొందరు, అసలు ఆయన కారు కాదని ఆయన బంధువులదనే ప్రచారం సాగుతోంది. అయితే పోలీసులు మాత్రం దీనిని నిర్ధారించలేదు. ప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎస్‌ఐ వీర్రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును డ్రైవర్‌కు అప్పగించి కారులోని వ్యక్తులు వేరే కారులో వెళ్లిపోయారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.