ప్రజాశక్తి-గుంటూరు : జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు మోటరు సైకిళ్ళు, ఆటోలు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులోనే ప్రయాణించేలా రవాణా శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై నిబంధలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రయాణించటం వలన ఇటీవల రహదారి ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సర్వీస్ రోడ్డులోనే ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి ప్రక్కన వ్యర్ధాలు వేయకుండా సంబంధిత మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాల్వలు సక్రమంగా ప్రవహించేలా జాతీయ రహదారి అధికారులను సమన్వయం చేసుకొని మున్సిపల్ అధికారులు డ్రైనేజీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. తెనాలి- నారాకోడూరు రహదారి మధ్యలోని బ్లాక్ స్పాట్‌ల వద్ద అవసరమైన పనుల నిర్వహణకు రహదారి భద్రత కమిటీ నిధులు మంజూరు చేసినందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. అలాగే నగరంలోని ఆర్‌అండ్‌బి రహదారుల అభివద్ధి పనులు కాంట్రాక్టర్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎస్.కె.కరీమ్, జిఎంసి ఎస్‌ఈ భాస్కర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాస మూర్తి, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ అండ్ డీజీఎం(టీ) టి.పార్వతీశం, జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.రవికాంత్, తెనాలి ఆర్టీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లింగనిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు
జిల్లాలోని లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో పి.సి.పి.ఎన్.డి.టి యాక్ట్‌పై నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ కమిటీ, జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.అర్చన, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్య నేరము, అడిగినవారు ప్రోత్సహించినవారు శిక్షార్హులు అనే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించేలా చూడాలన్నారు. తనిఖీలు నిర్వహించి చట్టం అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయమూర్తి అర్చన మాట్లాడుతూ ఈ చట్టంపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ సహకారంతో ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ.శ్రావణ్‌బాబు జిల్లాలో కొత్తగా రిజిస్ట్రేషన్‌కు 12 కేంద్రాలు, రెన్యూవల్ కోసం 8 కేంద్రాలు, రద్దు కోసం 10 కేంద్రాలు, మోడిఫికేషన్ కొరకు 9 కేంద్రాలు దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు. కమిటీ ఆయా దరఖాస్తులను ఆమోదించింది. సమావేశంలో కమిటీ సభ్యులు ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులు అబ్దుల్ రఫీక్, గైనకాలజిస్ట్ డాక్టర్ సునీత, అనాటమీ ఫ్రోఫెసర్ డాక్టర్ సావిత్రి, పీడియాట్రిస్టు డాక్టర్ రవీంద్రనాయక్, దిశా డీఎస్పీ రామారావు, సీడ్స్ సంస్థ నుంచి అమ్మాజీ, డీఐఓ సుబ్బరాజు, పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్