Apr 27,2023 17:31

ఎంపీకి వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలి
పేద రైతులను ఆదుకోవాలి
రైతు సంఘం ఆధ్వర్యంలో కానాల, రైతు నగరం రైతులు ఎంపీకి వినతి
ప్రజాశక్తి - నంద్యాల

      నంద్యాల నుండి జమ్మలమడుగు వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణానికి అలైన్మెంట్‌ను మార్చి పేద రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారి భూసేకరణకు అలైనమెంట్‌ మార్చి కానాల, రైతునగరం గ్రామాల పేద రైతులను ఆదుకోవాలని కోరుతూ ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు గురువారం నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌ మాట్లాడుతూ రైతుల జీవనోపాధి కోసం ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వం జాతీయ రహదారికి తీసుకోవడం వల్ల కుటుంబాలన్నీ వీధి పాలవుతాయని చెప్పారు. ఇప్పటికే నేషనల్‌ హైవే 44 నుండి రైతు నగరం గ్రామం వరకు ప్రభుత్వ భూమిలో 40 అడుగులు వెడల్పు గల రహదారి ఉందని, ఈ దారికి ఇరువైపులా జాతీయ రహదారి కోసం భూ సేకరణ చేయడం వల్ల పేద రైతులపై భారం తగ్గుతుందని తెలిపారు. ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుందని చెప్పారు. పేద రైతులపై దయవుంచి జాతీయ రహదారి అలైన్మెంట్‌ను మార్చాలని ఎంపీని కోరారు. ఎంపీ పోచా మాట్లాడుతూ ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడానని, ప్రస్తుతం సర్వే పనులు జరగకుండా నిలుపుదల చేయించానని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గం కోసం ఉన్నతాధికారులతో చర్చిస్తున్నానని తెలిపారు. త్వరలోనే నేషనల్‌ హైవే అథారిటీ ఉన్నతాధికారులతో చర్చించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పేద రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. దీంతో రైతులందరూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు, రైతులు సుబ్బారావు, శంకర్రావు, రామ చిన్నమ్మ, మనోహర్‌, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, మధు తదితరులు పాల్గొన్నారు.