Sep 08,2023 20:32

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలోని జాతీయ రహదారులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌ వద్ద ఎన్‌హెచ్‌, ఆర్‌అండ్‌బి అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమావేశమై జాతీయ రహదారులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారులు పూర్తయి అనుబంధంగా ఉన్న రోడ్ల మార్గాలను ప్రయాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కోరారు. ముఖ్యంగా నరసాపురంలో ఎన్‌హెచ్‌కి ఆనుకుని ఉన్న సుమారు 15 మార్గాలను రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే నరసాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా, అడవిపాలెం ఎఫ్‌సిఐ గోడౌన్‌ వద్ద ఎన్‌హెచ్‌ రహదారిలో ఒక సీజన్‌లో నీరు పెద్ద ఎత్తున నిల్వ ఉంటోందని, సాంకేతికంగా పరిశీలించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. నరసాపురం బైపాస్‌ ఏర్పాటుకు భూసేకరణ పనులు పూర్తయ్యాయని, త్వరితగతిన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. శృంగవృక్షం ప్రాంతంలో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని, దీనికి అనుబంధంగా పనులను చేపట్టాలని ఆదేశించారు. ఉండి, మేడపాడు - నరసాపురం రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ అవార్డులను వెంటనే పాస్‌ చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. సీతారాంపురం టు కాళీపట్నం మధ్యగల నేషనల్‌ హైవేకు ఆనుకుని కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగు తున్నాయని, ఎన్‌హెచ్‌ అధికారులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, తగు చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. సిఆర్‌ఎఫ్‌ కింద పెద్ద కాపవరం, చిన్న కాపవరం ప్రాంతాల్లో మంజూరైన రెండు రోడ్ల నిర్మాణాలకు ముందుగా ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌ - 216ఎ పీడీ డి.సురేంద్రనాథ్‌, పిఎం కె.బాలసుబ్రమణ్యం, డిపిఎం కె.శ్రవణ్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ 165 డిఇ ఎం.శ్రీనివాసరావు, కాకినాడ ఎన్‌హెచ్‌ డిఇ ఎల్‌ఎస్‌.సుబ్రహ్మణ్యం, జిల్లా ఆర్‌అండ్‌బి అధికారి బి.లోకేశ్వరరావు పాల్గొన్నారు.