జాతీయ రాజకీయాలను బ్రష్టు పట్టించన వ్యక్తి చంద్రబాబు : రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు
ప్రజాశక్తి -రేపల్లె
అవినీతి, అక్రమాలతో టిడిపి కౌంట్ డౌన్ ప్రారంభమైందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. స్థానిక తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విధి నిర్ణయానికి ఎవరు అతీతులు కాదని అన్నారు. చంద్రబాబు తన జైలు జీవితాన్ని ఊహించలేదని అన్నారు. వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకుని కనపడని అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అభివృద్ధికి సంబంధించిన విషయాలలో ముందు చూపుతో వ్యవహరించే చంద్రబాబు, అవినీతి అక్రమాల పట్ల ముందు చూపుతో వ్యవహరించక పోవడం విచారకరమన్నారు. చంద్రబాబు అరెస్టును అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు ఘోషించటం దుర్మార్గమన్నారు. చంద్రబాబుకు మద్దతు తెలపడం అవినీతిని ప్రోత్సహించడమేనని అన్నారు. గతంలో తనను, సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఏ తప్పు చేయకపోయినా అప్పట్లో సోనియా గాంధీ, చిదంబరంను ప్రసన్నం చేసుకొని అన్యాయంగా కేసులలో ఇరికించారని గుర్తు చేశారు. మాట్లాడితే జైలు పక్షులని ఎద్దేవ చేస్తున్న టిడిపి నాయకులు ఇప్పుడు ఎవరు జైలు పక్షులయ్యారో తెలుసుకోవాలన్నారు. సిఎంను సైకో జగన్ అని పిలుస్తూ అపహాస్యం చేస్తున్న లోకేష్, అచ్చెన్నాయుడు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను బ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రెండు ఎకరాల పొలంతో రాజకీయ జీవితం ప్రారంభించన చంద్రబాబు ఈరోజు రూ.వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పోలవరం, పట్టిసీమ, రాజధాని ప్రాంతాలను బంగారు బాతు గుడ్డులా మార్చుకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. నమ్మిన వారిని నట్టేట ముంచే స్వభావం చంద్రబాబుదన్నారు. ఎవరైనా తప్పును తప్పుగా ఒప్పుకోవాలని అన్నారు. కానీ తప్పులను వెనకేసుకు రాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మసలుకోవాలని అన్నారు.










