Jul 26,2021 08:09

న్యూఢిల్లీ : జాతీయ రాజకీయాల్లోకి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వడివడిగా అడుగులేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌ గడ్డపై బిజెపిని మట్టికరిపించిన ఆమె...జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆమె టిఎంసి పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడమే అందుకు నిదర్శనం. పలువురు విశ్లేషకులు దీన్ని ముందు నుండి ఊహిస్తూనే వచ్చారు. బిజెపినే లక్ష్యంగా ఆమె జాతీయ రాజకీయాల్లోకి దూసుకు వస్తున్నారు. దానికి సంబంధించిన సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎప్పుడూ కాంగ్రెస్‌, వామపక్ష నేతలపై చిర్రుబుర్రులాడే మమతా..ఈనెల 21న అమరుల సంస్మరణ సభలో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే ముగించారు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే పని ప్రారంభించాలని, సమయాన్ని వృథా చేయకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమావేశాన్ని ప్రతిపక్ష నేతలు చిదంబరం, దిగ్విజరు సింగ్‌, శరద్‌ పవార్‌, మనోజ్‌ ఝా, సుప్రియా సూలే, జయా బచ్చన్‌, రామ్‌ గోపాల్‌ యాదవ్‌ వంటి నేతలు వీక్షించడం ఈ వార్తలకు ఊతమిచ్చినట్లయింది.
మమతా బిజెపిని లక్ష్యంగా చేసుకున్నారన్నదీ స్పష్టంగా తెలుస్తోంది. ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం, బల ప్రదర్శన చేయడమే బిజెపికి తెలుసునని తీవ్రంగా విమర్శించారు. అలాంటి వారికి బెంగాల్‌ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారంటూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే ఖేలా హోబే (ఆట కొనసాగుతుంది) అంటూ వ్యాఖ్యానించారు. బిజెపి ఆటకట్టించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ర్యాలీలో ఆమె ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో పాటు బిజెపి వర్గాలను తీవ్ర స్థాయిలో దునుమాడారు.. దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలు, పెగాసెస్‌, కరోనా కట్టడిలో కేంద్రం వైఫల్యం, ఆర్థిక అంశాలపై బిజెపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటయ్యే అవకాశాలుంటే...అందులో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. తృణమూల్‌ తరహాలో బిజెపికి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్‌, డిఎంకె, అకాలీదళ్‌, ఎన్‌సిపితో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఏకమయ్యేందుకు సిద్ధమయ్యాయి. వీరితో ఆమె కూడా జత కలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళుతున్నానని, పలు ప్రతిపక్ష నేతలను కలుస్తానని మమతా తెలిపారు.