ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి స్ఫూర్తిగా నిలిచేందుకు జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కలెక్టర్ పి రంజిత్ బాషా వెల్లడించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ విభాగాలలో నిమగమైఉన్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న దీనిని పాటిస్తారన్నారు. పౌర సేవకులు దేశం యొక్క పరిపాలనా యంత్రాంగాన్ని సమిష్టిగా మరియు పౌరులకు సేవ చేయాలనే అంకితభావంతో నడపాలనేది కూడా ఈ రోజు ప్రధాన అంశమన్నారు. మనకు తెలిసినట్లుగా సివిల్ సర్వీస్ అనేది దేశ ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలనకు బాధ్యత వహించే సేవ అన్నారు. 16వ నేషనల్ సివిల్ సర్వీసెస్‌డే సందర్భంగా సభ్యులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివ జ్యోతి, డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు, మత్స్యశాఖ జెడి సురేష్, పౌర సరఫరాల శాఖ అధికారులు విలియమ్స్, శ్రీలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










