ప్రజాశక్తి-బాపట్ల: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని బాపట్ల జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ విజయమ్మ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నులిపురుగుల నివారణ దినోత్సవ గోడ ప్రతులను ఆమె ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మూడు లక్షల ఇరవై వేల పైబడి విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారందరికీ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందిస్తున్నామన్నారు. జిల్లాలో 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ మాత్రల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒకటి నుంచి 19 యేళ్ల విద్యార్థులందరికీ ఈ టాబ్లెట్స్ అందేలాగా చర్యలు తీసుకున్నామన్నారు. 25 మండలాలకు ఈ మాత్రలు అందజేశామన్నారు. నులిపురుగుల నివారణకు వైద్య శాఖకు సంబంధించి జిల్లాలో డివిజన్ వారీగా అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఈ టాబ్లెట్స్ వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు. వీటి వాడకం రేపటి తరం ఆరోగ్య రక్షణకు దారి చూపిస్తుందని పేర్కొన్నారు. అపరిశుభ్రత వల్ల చిన్నారుల్లో నులిపురుగుల సమస్య తీవ్రంగా మారుతుందన్నారు. తొలి దశలోనే సమస్యను అరికట్టాలని, లేకపోతే అనారోగ్య సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ మాత్రల వినియోగంపై దగ్గరలోని యూపీహెచ్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి వెంకటేశ్వరావు, రోహిణి రత్నకుమారి, ఎం సౌజన్య, ఎన్‌డిడి ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ ఎన్ కోటబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










