జాతీయ లోక్ అదాలత్‌లో 9,768 కేసులు పరిష్కారం- జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గీత

కడప : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా 24 బెంచీలు ఏర్పాటు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సాయంత్రం 6:30 గంటల వరకు అందిన సమాచారం మేరకు 9768 కేసులు పరిష్కరించి రూ. 2,45,62,800 కక్షిదారులకు చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ జి.గీత, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం. ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 24 బెంచీలు ఏర్పాటు చేశామని, ఇందులో కడపలో 6, ప్రొద్దుటూరులో 4, రాజంపేటలో1, రాయచోటిలో 3, బద్వేల్‌లో 2, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, మైదుకూరు, సిద్ధవటం, నందలూరు, రైల్వేకోడూరు నందు ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టులో ఉన్న ఎం.వి.ఓ.పి నంబర్:458/2019 కేసులో రూ. 60 లక్షలు మొత్తానికి వాదులు, ప్రతివాదులు, చోళ మండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు జాతీయ లోక్ అదాలత్ లో రాజీ అయ్యారని చెప్పారు. ఈ కేసులో న్యాయవాదులుగా జి.ఎస్.మూర్తి, సంపత్ కుమార్ వ్యవహరించినట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కషి చేసిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జాతీయలోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ మెంబెర్స్, కక్షిదారులు వారి వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి వారి వారి కేసులను పరిష్కరించుకున్నారు. కోవిడ్ నియమావళిని పాటిస్తూ జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రసూన, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ భార్గవి, ఎక్సైజ్ కోర్టు జడ్జి హేమ స్రవంతి, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.