Oct 01,2023 01:07

పల్నాడు జిల్లా: జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పై రైతులకు అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా తయారు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. పట్టణంలోని ప్రకాష్‌ నగర్‌ లో గల భువనచంద్ర టౌన్‌ హాల్‌ లో శనివారం జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పై రైతు లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ గొర్రెలు,మేకల శాస్త్రీయ నిర్వహణ, పందుల పెంపకం,పౌల్ట్రీ ఫామ్‌ నిర్వహణ వంటి కీలకమైన అంశాలపై దృష్టి సారించి స్వయం ఉపాధి అవకాశాలు సాధించాలని కోరారు. రూ .1 కోటి అంచనా వేసిన ప్రాజెక్టుకు 50 శాతం రాయితీ రుణాలు అందిం చడం ఈ ప్రాజెక్ట్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్‌ కర్రి సాయి మార్కెండేయ రెడ్డి, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్‌ బూడిద సైదులు మాట్లాడుతూ జంతువుల ఉత్పాదకతను పెంచడం, మాంసం, గుడ్లు, మేక పాలు, ఉన్ని, మేత ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా చాలా ఉపాధి అవ కాశాలు, ఆర్థిక శక్తి ని పెంచుకోవచ్చన్నారు. రాయితీలను అందిపుచ్చుకోవాలని రైతులు మెరుగైన జీవనం సాగిం చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ కె.కాంతారావు, డిప్యూటీ డైరెక్టర్‌ పి.రామా రావు, డివిజనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సిహెచ్‌. నరసింహులు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సన్న జీవాల పెంపకం, పౌల్ట్రీ, పందుల పెంపకం మరియు పశుగ్రాసం రంగాలలో వ్యవస్థాపకతను పెంపొందించాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించడానికి, సుస్థి రతను పెంచాలన్నారు. కార్యక్రమంలో 700 మంది పశువుల పెంపకందారులు పాల్గొన్నారు.