
ప్రజాశక్తి - వీరవాసరం
జాతీయ స్థాయి లో వీరవాసరం గ్రామానికి గుర్తింపు తెచ్చిన క్రీడాకారిణి కుసుమకు అన్ని విధాలా చేయూతనిస్తామని జెపి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, జెడ్‌పిటిసి గుండా జయప్రకాష్ నాయుడు అన్నారు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి లాంగ్ జంప్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించిన కుసుమను సోమవారం కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. కాపు సర్వీస్ క్లబ్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్‌పిటిసి జయప్రకాష్ మాట్లాడుతూ గతం నుంచి వీరవాసరానికి క్రీడా రంగంలో ఎంతో పేరుందని, ఆ ఒరవడిని కుసుమ కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. ఆమె కోచింగ్‌కు అవసరమైన సహాయ సహకారాలను జెపి ఫౌండేష్ అందజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు వనిత క్లబ్ ప్రెసిడెంట్ బి.లక్ష్మీకళ్యాణి, యర్రంశెట్టి శీనయ్య, గుండా బాబు, కుంచే వేణు, కెవిఎల్.కుసుమ, తల్లి దుర్గాభవానీ పాల్గొన్నారు.