ప్రజాశక్తి - కోసిగి
డిసెంబర్ 15, 16, 17న కర్నూలులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు కోరారు. సోమవారం కోసిగిలో రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని మండలాలు నిత్యం కరువు, కాటకాలకు గురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రైతులు, వ్యవసాయ కూలీలు కేవలం ఆరు నెలలు మాత్రమే ఇక్కడ ఉంటారని చెప్పారు. మిగతా ఆరు నెలలు బతకడానికి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు. ప్రాంతానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కింద పని దినాలు పెంచి రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని కోరారు. ఆర్‌డిఎస్ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని, పులికనుమ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వ్యకాస పెద్దకడభూరు మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా నాయకులు మల్లయ్య, ఈరన్న, సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడు, రైతుసంఘం మండల కార్యదర్శి వీరేష్ పాల్గొన్నారు.