Aug 16,2023 00:26

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌, మంగళగిరి : నిడమర్రు నుంచి ప్రారంభమైన లోకేష్‌ యువగళం పాదయత్రకు ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. 185వ రోజు జరుగుతున్న పాదయాత్రలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివర్ణపతాకం చేబూని లోకేష్‌ పాదయాత్ర నిర్వహించారు. కార్యకర్తలు జాతీయ జెండాలు పట్టుకొని పాదయాత్రలో నడిచారు. పాదయాత్రకు సంఘీభావంగా మంగళగిరి ప్రజలు, అభిమానులు తరలవచ్చారు. భారీ గజమాలలతో స్వాగతం పలికారు. అందర్నీ లోకేష్‌ పలకరిస్తూ సమస్యలు వింటూ మంగళగిరి వరకు ఈ పాదయాత్రను కొనసాగించారు.
సర్పంచుల వినతి
సర్పంచులు తమ సమస్యలను లోకేష్‌ దృష్టికి తెచ్చారు. పంచాయతీ నిధులను కాజేశారని, ప్రభుత్వం కొల్లగొట్టిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు తిరిగి ఇప్పించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించాలని కోరారు. లోకేష్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రిగా తాను తెచ్చిన ఎన్నో సంస్కరణలను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, పంచాయితీలకు పూర్వ వైభవన్ని తీసుకువస్తానని చెప్పారు.
లోకేష్‌ను కలిసిన దుగ్గిరాల పసుపు రైతులు
నిడమర్రు సెంటర్‌లో దుగ్గిరాలకు చెందిన పసుపు రైతులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గతంలో దేశవాళీ టేకూరిపేట రకం విత్తన పంటకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉండి, రైతులు, వ్యాపారులకు లాభదాయకంగా ఉండేదని చెప్పారు. కాలక్రమంలో ఆ రకం పంట అంతరించి, పసుపుపంట విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని, సేలం రకం పసుపు విత్తనాలు మాకు అందుబాటులోకి తెచ్చినట్లయితే ఇతర రాష్ట్రాల మాదిరిగా మాకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని తెలిపారు. గతంలో హార్టికల్చర్‌ శాఖ తరపున హెక్టారుకు రూ.12500 సబ్సీడీ అందించేవారని, 2020లో తర్వాత రాయితీలేమీ రావడం లేదని అన్నారు. ఈ-నామ్‌ టెండర్‌ విధానం వల్ల రైతులు అవగాహనలేక పసుపును మార్కెట్‌ యార్డ్‌ కు తీసుకురావడం లేదన్నారు. ఓపెన్‌ ఆప్షన్‌ లేకపోవడంతో దళారుల ప్రమేయంతో పసుపు రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో దుగ్గిరాలలో 12 వరకు పసుపు పరిశ్రమలు ఉండేవనీ, ప్రస్తుతం సరిగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో యంత్ర సామగ్రి దెబ్బతిని, కేవలం నాలుగైదు యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయని వివరించారు. లోకేష్‌ స్పందిస్తూ వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రంలో రైతాంగం నానా అగచాట్లు పడుతున్నారని, రైతులకు అవసరమైన విత్తనాలను కూడా సరఫరా చేయకపోవడం ఈ ప్రభుత్వ దివాలాకోరు తనానికి అద్దం పడుతోందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పసుపు పంటకు హార్టికల్చర్‌ సబ్సిడీలను అందిస్తామని, రైతులు కోరుకుంటున్న విధంగా సేలం రకం విత్తనాలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. నాణ్యమైన విద్యుత్‌ తోపాటు పసుపు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని, మెరుగైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి రైతులకు మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
అభివృద్ధి అంటే రంగులు వేసుకోవడమేనా?
నిడమర్రులో పేదలకోసం గత టిడిపి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాల వద్ద లోకేష్‌ సెల్ఫీ దిగారు. కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్‌ మేం నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసిపి రంగులేసుకున్నారని ఎద్దేవ చేశారు. వైసిపి పాలనలో చేసిందేమైనా ఉందంటే అది స్టిక్కర్లు వేసుకోవడమేనని, కూల్చివేతలు మినహా పదవీకాలం ముగిసే లోపు ప్రజలకోసం నేను ఫలానా మంచి పని చేశానని ఒక్కటైనా చూపించగలరా? అని అన్నారు. టిడ్కో ఇళ్ల దగ్గర కనీసం మౌలిక వసతులు కల్పించడం జగన్‌ ప్రభుత్వానికి చేతకాలేదన్నారు.
విజనరీ పాలనకు ఇవే సాక్ష్యాలు
ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఉన్నత విద్యకోసం పొరుగురాష్ట్రాల బాట పట్టకూడదన్న ఉద్దేశంతో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న అమృత విశ్వవిద్యాలయాన్ని గత ప్రభుత్వంలో అమరావతికి తెచ్చామని, విట్‌, ఎస్‌ఆర్‌ఎం లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలను కూడా ఆనాడు రాష్ట్రానికి రప్పించామని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ విద్యాలయాలకు వెళ్లేందుకు కనీసం రహదారి సౌకర్యం లేకుండా రోడ్డును తవ్వేసి విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తున్నాడని విమర్శించారు. జగన్‌ ఏలుబడిలో రాష్ట్రంనుంచి వెళ్లిపోవడమే తప్ప కొత్తగా ఒక్క పరిశ్రమగానీ, విద్యాసంస్థగానీ వచ్చింది లేదన్నారు.
మంగళవారం రాత్రి మంగళగిరికి చేరుకున్న లోకేష్‌కు నిడమర్రు రైల్వే గేట్‌ వద్ద ఘన స్వాగతం పలికారు. రైల్వేగేటు వద్ద నియోజకవర్గ మహిళలు లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థినులు, యువతులకు ప్రత్యేక హాస్టల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. మద్యాన్ని నియంత్రించి, గంజాయి విక్రేతలపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. లోకేష్‌ మాట్లాడుతూ నాలుగేళ్లలో మహిళలపై 52,587 నేరాలు జరిగాయని, ప్రతి గంటకు రెండు నేరాలు నమోదవుతూ మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల వైపు కామాంధులు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తామన్నారు. కృష్ణబలిజ సంక్షేమసంఘం ప్రతినిధులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. లోకేష్‌ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణబలిజల ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తామన్నారు. బిసి జనగణన ద్వారా ఆయా వర్గాల జనాభాను గుర్తించి న్యాయం చేస్తామని, ఇల్లులేని వారికి పక్కాగహాలు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, దామర్ల రాజు, ఆరుద్ర భూలక్ష్మి, జానకి దేవి, ఇంజమూరి ఆశాబాల, పడవల మహేష్‌, గోవా దుర్గారావు పాల్గొన్నారు.