Nov 19,2023 21:12

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ రామానుజన్‌ గణిత అకాడమీ నిర్వహించే 34వ జాతీయ గణిత పోటీలు రాష్ట్రవ్యాప్తంగా గణిత స్ఫూర్తితో ఆదివారం జరిగాయి. ఈ మేరకు అకాడమీ కార్య నిర్వాహక సభ్యుడు, ప్రముఖ గణితావధాని తోటకూర సాయి రామకృష్ణ వివరాలను అందజేశారు. ప్రిలిమనరీ పరీక్షలు గత సెప్టెంబర్‌ నెలలో ఆయా స్కూల్స్‌లో నిర్వహించారు. వాటిలో ప్రతిభ చూపిన 10 శాతం విద్యార్థులను ఫైనల్‌ పరీక్షకు ఎంపిక చేసి, నిర్ణయించిన కేంద్రాల్లో నిర్వహించినట్టు తెలిపారు. స్థానిక బచ్చు ఫౌండేషన్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సెంటర్‌ కన్వీనర్‌గా కె.శివప్రసాద్‌ వ్యవహరించారు. సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో విలువైన బహుమతులు, నగదు పురస్కారాలు, గ్రంథాలు, మెమెంటోలతో ప్రముఖుల ద్వారా సత్కరించనున్నట్లు సాయి రామకృష్ణ తెలిపారు. వచ్చే నెల 17న రామచంద్రపురంలో బహుమతి ప్రధాన సదస్సు వ్యవస్థాపకులు డాక్టర్‌ కెవివి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.