జాషువాచిత్రపటానికి నివాళులు
ప్రజాశక్తి మర్రిపాడు : నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో వైసిపి మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు, గ్రంథాలయ భాండాగారి నారాయణరావులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అవమానాలనే గెలుపునకు సోపానంగా చేసుకొని కాలాన్నే ఆయుధంగా మలచుకొని చీత్కారాలు ఎదురైన చోట సత్కారాలు పొంది పద్మభూషణ్ లాంటి ఎన్నో బిరుదులు పొందిన కవిదిగ్గజం గుర్రం జాషువా అని కొనియాడారు. వడగాల్పు నా జీవితం వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ, సంఘర్షణ, ఆర్థిక అసమానతులపై పోరాడిన అభ్యుదయవాది గుర్రం జాషువా అన్నారు. నాటికి నేటికి సమాజంలో పరిస్థితులు మారాయని మనుషులంతా ఒక్కటేనని ఈ మార్పులు విద్య ద్వారా జరిగాయని వారు అభిప్రాయపడ్డారు. కుల మతాలు అంటరానితనం లాంటి మూఢాచారాలు తగ్గి అందరూ ఒక్కటేనని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. రాష్ట్ర క్రీడాభివృద్ధి శాప్ సంస్థ డైరెక్టర్ కాలువ నర్సింహులు జాషువా రచించిన గబ్బిలం కావ్యం నుండి పద్యాలను అద్భుతంగా పాడి అందరిని ఆకట్టుకున్నారు. శాప్ డైరెక్టర్‌కు శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కెజిబివి ప్రిన్సిపల్ లక్ష్మీదేవి ఉపాధ్యాయనులు భాగ్యలక్ష్మి, కళ్యాణి, విద్యార్థినులు పాల్గొన్నారు.










