Sep 28,2023 23:01

ప్రజాశక్తి - చీరాల
జాషువా సాహిత్యం సమాజానికి దిక్సూచి అని, ఆయన సాహిత్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని మౌలానా ఆజాద్, నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ జివి రత్నాకర్ అన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి సభ జాషువా సాహితీ సమితి, యుటిఎఫ్, కెవిపిఎస్, జెవివి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో భవనంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు లింగం జయరాజు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సభలో డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ సమాజంలోని అనేక రుగ్మతలను జాషువా తన సాహిత్యం ద్వారా ఎలుగెత్తారని అన్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో జాషువా సాహిత్యంపైన పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. జాషువా నాడు కుల పీడన గురించి రచనలు చేసినాడని అన్నారు. అభివృద్దిలో దూసుకుపోతున్న తరుణంలో కూడా కులం గురించి మాట్లాడుకోవాల్సి రావడం, కులం పేరుతో దాడులు జరగడం చాలా విచారకరమని అన్నారు. జాషువా తన జీవిత చరమాంకం వరకు పీడిత ప్రజల పక్షాన తన రచనలను కొనసాగించారని అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రజలను చీల్చి లబ్ధి పొందాలనుకునేవారు కులం, మతం, ప్రాంతం పేరుతో విడదీస్తారని జాషువా ఆనాడే పేర్కొన్నారని అన్నారు. నేటి రాజకీయాలు వాటిని తలపిస్తున్నాయని అన్నారు. తన తండ్రి లుకా మాస్టర్ కడవరకు జాషువా సాహిత్యాన్ని ప్రజలకు చేరువు చేయడానికి కృషి చేశారని అన్నారు. ఆ స్పూర్తిని తాను కొనసాగిస్తానని తెలిపారు. కవితా విమర్శకులు పి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జాషువా తన సాహిత్యం ద్వారా ప్రజల్లో నిలిచి ఉంటారని అన్నారు. అనంతరం డాక్టర్ రత్నాకర్ రచించిన ముసి కథ పుస్తక ఆవిష్కరణ చేశారు. యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బండి భిక్షాలుబాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్‌జె చిరంజీవి, ప్రజాసంఘాల నాయకులు నుకతోటి బాబురావు, ఏసోబు, గుమ్మడి ఏసురత్నం, వివిధ కవులు సిహెచ్ వెంకట్, పాపారావు పలువురు మాట్లాడారు. జాషువా పద్యాలను అలరించారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి నలతోటి బాబురావు, ఎం వసంతరావు, భగవాన్, డేవిడ్, పి కిరణ్ పాల్గొన్నారు.