ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలోని విద్యార్థుల్లో దాదాపు సగం మంది గుంటూరు నగరంలోని పాఠశాలల్లోనే చదువుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కువ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. ఆయా పాఠశాలల పర్యవేక్షణకు విద్యాశాఖ ఇద్దరు ఎంఇఒలను కేటాయించినా, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవటం లేవు.
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని అర్బన్ మండలాలను విద్యాశాఖ విభజించి కొత్తగా ఎంఇఒ కార్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చి ఏడాదైనా గుంటూరులో మాత్రం అమలు కావట్లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా తహశీల్దార్ కార్యాలయాలను విభజించి తూర్పు, పశ్చిమ మండలాలుగా విభజించిన విధంగా విద్యాశాఖ కూడా ఆ విధంగా విభజిస్తూ గతేడాది ఏప్రిల్‌లో ఉత్తర్వులిచ్చింది. కానీ ఇంత వరకూ గుంటూరులో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఒకే కార్యాలయలంలో కొనసాగుతోంది. రెండు మండలాల బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించారు. ఉత్తర్వులను అమలు చేయాల్సిన పై అధికారులు పూర్తి స్థాయిలో ఎందుకు చేయట్లేదని ఉపాధ్యాయులకు అంతుచిక్కట్లేదు.
గుంటూరు తూర్పు మండల పరిధిలో ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్, జెడ్పీ, ప్రైవేటు అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పాఠశాలలు కలిపి 192 ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 229 పాఠశాలలున్నాయి. ఉన్న పాఠశాలల పర్యవేక్షణే కష్టంగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటంతో మరింత పనిభారం పెరిగింది. అయినా అధికారులు కొత్త ఎంఇఒ కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా ఒక్క అధికారి, ఒక్క కార్యాలయంతోనే నెట్టుకొచ్చారు. దీంతో పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువై అధికారులకు పర్యవేక్షణ పెద్ద సమస్యగా మారింది. ఉపాధ్యాయులకు సంబంధించిన ఫైళ్లు అనేకం నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన కార్యాలయాలు ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు చేపట్టాలని సంఘాలు కోరుతున్నాయి.
ముఖ్యంగా ఉపాధ్యాయులకు మెడికల్ లీవులు, స్టడీ లీవులు, రిటైర్ అయిన వారికి బెన్ఫిట్స్ ఇవ్వటానికి పెద్ద ఎత్తున డబ్బులు అడుగుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఒక చకచకా పనులు చేస్తూ, డబ్బులు ఇవ్వని వారి పైళ్లు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా రెండు మండలాలకు వేర్వేరు కార్యాలయాలు, వేర్వేరుగా ఎంఇఒలను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.










