ప్రజాశక్తి-విజయనగరంకోట : ఉపాధ్యాయుడు బద్రి కూర్మారావు సేకరించిన కళింగసీమ జానపద కథలు పుస్తకాన్ని మంగళవారం గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గిరిజన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టివి కట్టమణి ఆవిష్కరించారు. జానపద కళలు, జానపద కథలు సేకరించి దాచుకోవలసిన అవసరం సమాజానికి ఎంతైనా ఉందని, దానికి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు ఎంతో పాటుపడాలని పేర్కొన్నారు. బద్రి కూర్మారావు వంటి ఉపాధ్యాయులు జానపద సాహిత్యాన్ని రక్షించడానికి తన వంతు కృషి చేయడం ఎంతో ముదావహమని ప్రశంసించారు. ఉత్తరాంధ్రలో వివిధ ప్రాంతాలలో తను పనిచేసిన పాఠశాలలో విద్యార్థులతో జానపద కథలను సేకరించి వాటిని క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తేవడం జానపద సాహిత్యానికి ఎంతో తోడ్పాటునందించినట్టు కవి రచయిత కిలపర్తి దాలి నాయుడు అన్నారు. అనేక రకాలైన మన తరతరాల సంపద అయిన జానపద కథలను సేకరించి ఈ పుస్తకంలో క్రోడీకరించబడ్డాయని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు ఎంవిఆర్ కృష్ణాజి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యాస, భాష పిల్లలు చదివి అర్థం చేసుకుంటే తెలుగుపై మంచి పట్టు సాధించగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరసం ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ, జక్కు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










