Oct 24,2023 19:30

కళాకారులను సత్కరిస్తున్న గ్రామస్తులు, నాయకులు

ప్రజాశక్తి- వేపాడ : జానపద కళలను, తెలుగు భాషను కాపాడుకోవాలని గిడుగు రామమూర్తి తెలుగు భాష, జానపద కళా పీఠం అధ్యక్షుడు బద్రి కూర్మారావు కోరారు. మండలంలోని కొండ గంగుబూడి పంచాయతీ ఎస్‌.కోట సీతారాంపురం గ్రామంలో కళాపీఠం ఆధ్వర్యంలో జానపద కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతికి మూలాలలైన తోలు బొమ్మలాట, జముకులు పాట, తప్పెట గుళ్ళు, గంగిరెద్దులు, దాసర్లు, బుడబుక్కలు, జంగాలు డప్పులు, థింసా, స్త్రీల పాటలు, బొబ్బిలి యుద్ధం, కాటమ రాజు కథ, గైరమ్మ పాటలు అంతరించి పోతున్నాయని వాటిని కాపాడు కోవాలని కోరారు. ఆంగ్లభాష మాధ్యమ మోజులో మరచిపోతున్న తెలుగు భాషను కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా సేవ గరిడి, తప్పెట గుళ్ళు, డప్పులు, ఎరుకుల పాటలు, స్త్రీల పాటలు కళాకారులు తమ పాటలను వినిపించారు. పిల్లలు అమ్మనాన్నముద్దు, మమ్మీ డాడీ వద్దు, అత్తా, మామ ముద్దు, ఆంటి, అంకుల్‌ వద్దు, తెలుగు భాష ముద్దు వంటి ప్లేకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరైన పంచాయతీ రాజ్‌ వింగ్‌ జోనల్‌ చైర్మన్‌ మెరపల సత్యన్నారాయణ మాట్లాడుతూ కళలను కాపాడు కోవాలని వంగ పండు ప్రసాదరావు వంటి వారు ఈ కళలు ద్వారానే ప్రజా గాయకుడు అయ్యారని అన్నారు. కళాపీఠం సభ్యుడు పొట్నూరు సురేష్‌ మాట్లాడతూ కూర్మారావు ఇరవై ఏళ్లుగా కళలు, సాహిత్యం పరిరక్షణకు పాటుపడుతూ పుస్తకాలు రాసారని, ఇప్పుడు మా గ్రామాల్లో కళాకారులు సమావేశం జరపడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సేవ గరిడి కళాకారుడు కోట అప్పలనాయుడు, డప్పు కళాకారులు పొట్నూరు శ్రీరాములు, ములపర్తి రాముడు కళాకారులను సాలువలతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కళాకారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.