Aug 22,2021 12:18

ప్రతి ఇంట్లో పెంచుకునే జామను పేదవాడి ఆపిల్‌గా అభివర్ణిస్తారు. పెద్దల నుంచి పిల్లల వరకూ ఇష్టంగా తినే పండు ఇది. జామతో ఆవకాయ, హల్వా, చీజ్‌, ఐస్‌క్రీములను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం...

                                                                     ఆవకాయ

 ఆవకాయ

కావాల్సిన పదార్థాలు : జామకాయలు- పావుకిలో (పచ్చివి), ఆవాలు- స్పూను, జీలకర్ర- స్పూను, ఆవపిండి- కప్పు, వెల్లుల్లి రెబ్బలు- పావు కప్పు, జీలకర్ర పొడి- పావు కప్పు, ఉప్పు- తగినంత, కారం- తగినంత, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండు మిరపకాయలు- నాలుగు, నూనె- కప్పు.
 

తయారుచేసే విధానం :

ముందుగా బౌల్‌ తీసుకొని, జామకాయ ముక్కలు, ఆవపిండి వేసి అటూఇటూ కలపాలి.

అందులోనే వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.

తర్వాత నూనె వేడిచేసుకుని అందులో పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిరెబ్బలు వేసి, స్టౌ ఆపుచేసి కరివేపాకు వేయాలి.

చల్లారాక ముందుగా కలిపి పెట్టుకున్న జామకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. దీన్ని గాలి చొరబడని సీసాలోకి తీసుకుని నిల్వ చేయాలి.

ఇది వారం వరకూ నిల్వ ఉంటుంది.                                                                                                                                   

                                                                     చీజ్‌

చీజ్‌

కావాల్సిన పదార్థాలు : పండిన జామపండ్లు - ఐదు (రెండు ముక్కలుగా తరగాలి), చక్కెర- రెండు కప్పులు, నెయ్యి, నిమ్మరసం- ఒక్కో టీ స్పూను.


తయారుచేసే విధానం :
ప్రెషర్‌ కుక్కర్‌లో కప్పు నీళ్లు, తరిగి పెట్టుకున్న జామపండు ముక్కలను వేసి, ఒక విజిల్‌ వచ్చేవరకూ స్టవ్‌ మీద ఉంచాలి.
కొంచెంసేపు తర్వాత కుక్కర్‌లోంచి ముక్కలు తీసి, చల్లార్చాలి. ఉడికిన జామపండు ముక్కలను మిక్సీలో వేసి, మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
దాన్ని ఫిల్టర్‌తో వడగట్టి, గుజ్జును విడిగా పెట్టాలి. గుజ్జు ఎంత ఉందో అంతే నిష్పత్తిలో చక్కెర ఉండాలి.
పెద్ద నాన్‌స్టిక్‌ పాన్‌లో గుజ్జు, చక్కెర, నిమ్మరసం, నెయ్యి వేసి బాగా కలిపి సన్నని మంటపై ఉంచాలి. అడుగంటకుండా గరిటెతో కలుపుతూ 22 నిమిషాలు ఉడికించాలి.
మిశ్రమం చిక్కబడిన తర్వాత నెయ్యి రాసిన అల్యూమినియం ట్రేలోకి మార్చి రెండు గంటలు అలాగే ఉంచాలి.
తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. అంతే జామపండు చీజ్‌ రెడీ.

                                                                        హల్వా

హల్వా

కావాల్సిన పదార్థాలు :  జామకాయలు - 4, పంచదార - కప్పు, నెయ్యి - 5 స్పూన్లు, నిమ్మరసం - స్పూన్‌, ఫుడ్‌ కలర్‌ - చిటికెడు.
తయారుచేసే విధానం :
ముందుగా జామకాయలను కడిగి, ముక్కలుగా తరుక్కోవాలి. వాటిని కుక్కర్‌లో వేసి అరగ్లాసు నీళ్లల్లో మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి.
అవి చల్లారాక నీళ్ళు తీసేసి, జామ ముక్కలు మిక్సీలో వేసి పేస్టు చేయాలి.
జామకాయ పేస్ట్‌ని వడకట్టి గింజలు లేకుండా మెత్తటి పేస్టు తీసుకోవాలి. గింజలు లేని మెత్తటి పేస్టును బౌల్లోకి తీసుకోవాలి.
జామకాయ గుజ్జుకి సమంగా పంచదార తీసుకోవాలి.
పాన్‌లో జామకాయ గుజ్జు, పంచదార వేసి, కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార కరిగాక నెయ్యి వేసి, చిటికెడు ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి.
స్పూను నిమ్మరసం కూడా వేయాలి. చిన్న మంట మీద కలుపుకుంటూ హల్వా బాగా దగ్గర పడేవరకు కలుపుతూనే ఉడికించాలి. అంతే వెరైటీ మరియు టేస్టీ జామకాయ హల్వా రెడీ.

                                                                       ఐస్‌క్రీం

 ఐస్‌క్రీం

కావాల్సిన పదార్థాలు : చిక్కటిపాలు- కప్పు, మీగడ- 2 1/4 కప్పు, పండిన జామపళ్లు-మూడు (మీడియం సైజు), చక్కెర- 3/4 కప్పు, వెనీలా ఎసెన్స్‌-అరస్పూను, చక్కెర (జామపళ్ల గుజ్జు కోసం)- రెండు స్పూన్లు, టాపింగ్‌ కోసం కారం- అరస్పూను, ఉప్పు-3/4 స్పూను.
 

తయారుచేసే విధానం :
జామ ఐస్‌ క్రీంను తయారుచేయడానికి ఒకరోజు ముందే ఐస్‌క్రీం కంటైనర్‌ని బాగా చల్లబర్చాలి.
జామకాయ పైన ఉన్న తొక్క తీసి, గుజ్జులోని గింజల్నీ తీసేయాలి.
తర్వాత జామపండును చిన్నముక్కలుగా తరగాలి. ఈ ముక్కల్ని చక్కెరతోపాటు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
ఐస్‌క్రీం మేకర్‌లో పాలు, మీగడ, వెనిల్లా ఎసెన్స్‌, కొద్దిగా ఉప్పు, సిద్ధం చేసుకున్న జామపండు గుజ్జులను అందులో పోయాలి.
అది బాగా కలిసిపోయి గడ్డలా తయారయ్యే వరకు మేకర్‌లోనే ఉంచాలి.
మెత్తగా అయిన ఐస్‌క్రీంను ఫ్రీజర్‌ కంటైనర్‌ నుంచి తీసి పది గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
తినేముందు ఉప్పు, కారం ఐస్‌క్రీం మీద కొద్దిగా చల్లుకుని తింటే స్పైసీగా, వెరైటీ రుచితో ఉంటుంది.