ప్రజాశక్తి-పెదబయలు:మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన జామిగూడ పంచాయతీలో శుక్రవారం అల్లూరి జిల్లా ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు సుడిగాలి పర్యటన చేశారు. ప్రింట్ మీడియాకు సమాచారం ఇవ్వకుండా మావోయిస్టు ప్రాంతంలో పోలీసు సెక్యూరిటీతో పర్యటించారు. జామిగూడ, గుంజివాడ మధ్యలో పెద్ద వాగు ఉండటంతో అనేక సందర్భాల్లో గిరిజనులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంత ప్రజల అభ్యర్థన మేరకు గత నెలలో జిల్లా కలెక్టర్ పర్యటించి హామీ ఇచ్చారు. దీంతో అరకు పార్లమెంట్ సభ్యురాలు మాధవి, జిల్లా చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, వైసిపి రాష్ట్ర కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ, ఆగ్రో డైరెక్టర్ వనాల్బ సన్యాసిలు వంతెన నిర్మాణానికి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ జామిగూడ పంచాయతీ కేంద్రంలో పోలీసు సెక్యూరిటీ మధ్యలో గడప గడపమన ప్రభుత్వం నిర్వహించారు. మంచినీరు, సిసి రహదారులకు రూ.20 లక్షలు ఎమ్మెల్యే ఫాల్గుణ మంజూరు చేశారు. గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో ఒక వ్యక్తి వచ్చి తొందరగా వెళ్లిపోవాలని ఎమ్మెల్యేను కోరడంతో క్షణం కూడా ఆగకుండా తిరుగు ప్రయాణం అయ్యినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో జర్సింగి బాలం నాయుడు, సురేష్, గంపరాయి సూరయ్య, మండల కన్వీనర్ కొర్ర కనకరాజు, సింహాచలం పాల్గొన్నారు.










