ప్రజాశక్తి - మక్కువ : తొలకరి పలకరించడంతో రైతులు తన పొలాల్లో నాట్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే సందర్భంలో ట్రాక్టర్లతో దమ్ములు చేయాల్సిన పరిస్థితి. అయితే ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్లకు దమ్ము చేసే ఇనుపచక్రాలను అమర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కనీస జాగ్రత్తలు పాటించకుంటే రహదారులు పాడయ్యే పరిస్థితి ఉంది. గత ఏడాది మక్కువ పోలీసులు రహదారి భద్రతపై పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది కూడా మండలంలోని ట్రాక్టర్లు యజమానులకు మరోసారి అవగాహన కల్పించి అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి పోలీసు శాఖపై ఉంది. ఆర్‌అండ్‌బి అధికారులు కూడా రహదారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంది. మండలం కేంద్రం నుండి ఇతర గ్రామాలకు వెళ్లే రహదారులు చాలావరకు కొత్తగా నిర్మించినవే కావడంతో దమ్ము చక్రాలతో కూడిన ట్రాక్టర్లను రహదారులపై నడవడంతో దాదాపు అవి పూర్తిస్థాయిలో దెబ్బ తినే పరిస్థితి ఉంది. ఇప్పటికే నీటి వనరులు ఉన్న పొలాల్లో ఊబాలు మొదలయ్యాయి. కొంతమంది ట్రాక్టర్లు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని విజయరాంపురం, దబ్బగెడ్డ రహదారి స్వల్పంగా దెబ్బతింది. గతేడాది పాటించాల్సిన జాగ్రత్తలు ఈ ఏడాది ట్రాక్టర్ యాజమానులు పాటించకపోవడంతో వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఇనుపు చక్రాలకు రక్షణ బెల్టు వేసేందుకు సమయం పడుతుందన్న నెపంతో యధాతధంగా ట్రాక్టర్లను రహదారులపై నడిపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అలాగే నిర్లక్ష్యం వహించి రహదారులు పాడు చేసే వారిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు










