ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఖరీఫ్ సీజన్‌లో మొదటి నెల ముగిసింది. ఇంత వరకు వ్యవసాయ పనులు వేగం పుంజుకోలేదు. నైరుతీ రుతుపవనాలు మందగించడంతో గుంటూరు,పల్నాడు జిల్లాల్లో వర్షాలు ముఖం చాటేశాయి. చాలినంత వర్షాలు లేక రైతులు సేద్యం వైపు వెళ్లేందుకు తటపటాయిస్తున్నారు. గుంటూరు,పల్నాడు జిల్లాల పరిధిలో దాదాపు 20 మండలాల్లో కనీస వర్షపాతం నమోదు కాక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.గత నాలుగు రోజులుగా మళ్లీ ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా వర్షం జాడలేదు. గుంటూరు జిల్లాలో జూన్ నెల మొత్తం 97.1 మిల్లీ మీటర్లవర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 105.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున సాధారణంగా స్వల్పంగా అధికంగా కురిసినా 18 మండలాలకు గాను 11 మండలాల్లోనే సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. మేడికొండూరు, తెనాలితో పాటు మరో ఏడు మండలాల్లో అవసరం మేరకు వర్షం కురిసింది. మిగతా మండలాల్లో చాలినంత వర్షం కురవలేదు. పొన్నూరు, వట్టిచెరకూరు, పెదకాకాని, తాడికొండ, తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరిలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయింది. పల్నాడుజిల్లాలో జూన్ నెలలో 80.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 81.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. పల్నాడు జిల్లాలో మొత్తం 28 మండలాలకు 20 మండలాల్లో కనీసవర్షపాతం నమోదు కాలేదు. సత్తెనపల్లి,యడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల, ముప్పాళ్ల, మాచవరం, అమరావతి, నకరికల్లు మండలాల్లో వర్షం ఆశాజనకంగా ఉంది. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, గురజాల, బెల్లంకొండ, అచ్చంపేట, ఈపూరు,రొంపిచర్ల తదితర మండలాల్లో 50 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. మాచర్లలో అత్యల్పంగా 10.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. గుంటూరు జిల్లాలో 76 వేల ఎకరాలకు గాను కేవలం 300 ఎకరాల్లోనే ఇప్పటి వరకు పత్తి విత్తనాలు నాటారు. పల్నాడు జిల్లాలో 3.04 లక్షల ఎకరాలకు గాను 13 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. వరిసాగు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని గ్రామాల్లో బోర్లు కింద వరిసాగు నారుమళ్లు పోస్తున్నారు. డెల్టా కాల్వలకు నీరు రావడంలేదు.అరకొర నీటి విడుదలతో రైతులుఇంకా వరినారుమళ్ల వైపు దృష్టిపెట్టలేదు. నాగార్జునసాగర్ నుంచి 7755 క్యూసెక్కులు నీరు దిదుగవకు విడుదల చేస్తుండగా పులిచింతల నుంచి 6200 క్యూసెక్కులనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజినుంచి పశ్చిమ డెల్టాకు కేవలం 100 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలోని తూర్పు డెల్టాకు 4667 క్యూసెక్కుల విడుదల చేస్తుండగా పశ్చిమ డెల్టాకు మాత్రం ఇంకా అరకొరగానేనీటి విడుదల కొనసాగుతోంది.










