ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రోహిణీ కార్తె ముగిసి వారం దాటింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చాయని వార్తలు వచ్చాయి. అయినా వడగాల్పులు తగ్గలేదు. వర్షాల జాడలేదు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అడపాదడపా జల్లులు పడుతున్నా వేడిగాలుల తీవ్రత కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
మంగళవారం పల్నాడు జిల్లా రావిపాడులో 44.3 డిగ్రీ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. యడ్లపాడు, పెదకూరపాడు, అమరావతిలో 43.6, అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు జిల్లా 17 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. అన్ని మండలాల్లో 43 నుంచి 44.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారమూ దాదాపు జిల్లా అంతటా వడగాల్పులు కొనసాగే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో 20 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 8 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రెండు జిల్లాల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేడిగాలుల తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీధుల్లో జనసంచారం తక్కువగా ఉంది. ఈ సమయంలో బస్టాండ్లలో ప్రయాణికులు సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఆర్‌టిసి బస్సులు మధ్యాహ్నం వేళ ప్రయాణికులు తక్కువ సంఖ్యతోనే ప్రయాణిస్తున్నాయి. మరోవైపు తెల్లవారుజూమున ఐదు గంటల వరకు ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది.
విద్యుత్ కోతలతో గ్రామీణ ప్రాంత వాసులు అల్లాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. మరమ్మతుల పేరుతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా నిలిపిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాత్రి వేళ అసలు గాలిలేక ఫ్యాన్లు తిరుగుతున్నా వేడి తీవ్రతతో మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. కరెంటు ఉన్న సమయంలో ఎసిలు, కూలర్లు విపరీతంగా వినియోగిస్తున్నారు. రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్లు కోటా ఉండగా 20 మిలియన్ యూనిట్లు వినియోగం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎండ తీవ్రతకు విద్యుత్ పరికరాలుకూడా దెబ్బతింటున్నాయని, వీటిని మరమ్మతుల కోసం కొన్ని సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానియాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. మజ్జిగ ప్యాకెట్లు, కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, తాటిముంజలు, సపోటకు డిమాండ్ పెరిగింది. ఐస్ క్రీమ్‌ల విక్రయాలు భారీగా పెరిగాయి.










