Aug 14,2023 00:39

ఉద్దండపుంరలో మోటార్‌తో తడుపుతున్న వరి నారు

ప్రజాశక్తి -నక్కపల్లి:
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వర్షాభావ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆరంభంలోనే అన్నదాతను నష్టాల్లోకి నెట్టేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు సరిగా పడక పోవడంతో ఎండ తీవ్రతకు వరి నారు, అక్కడక్కడ ఉడిసిన వరి చేలు ఎండిపోతున్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో ఉడుపులు సాగక వరి నారు ముదురు పోతుంది. ఆదిలోనే చినుకు జాడ లేక పోవడంతో రైతులు తీవ్ర నిరాశతో కొట్టు మిట్టాడుతున్నారు.
మండలంలోని ఖరీఫ్‌ సీజన్‌ సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వరి విత్తనాలను అందచేసారు. ఆర్‌జిఎల్‌, సాంబ మసూరి, ఇంద్ర, అమర వంటి రకాల వరి విత్తనాలను 775 క్వింటాలు రైతులకు సరఫరా చేశారు. జూన్‌, జూలై నెలల్లో అడప దడపా కురిసిన వర్షాలకు రైతులు ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధమై నారు మడులను సిద్ధం చేసి వరి నారు కోసం వరి విత్తనాలను జల్లారు. ఇప్పటి వరకు వర్షాలు సక్రమంగా లేక పోవడంతో ఆకు ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. చాలా చోట్ల ఆకు ముదిరి పోయింది. ఎండ తీవ్రతకు వరి ఆకు ఎండి పోతుండటంతో, వరి ఆకును రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పొలాల్లో బావులు ఉన్న రైతులు మోటార్ల సహాయంతో నారుమడులకు నీరు పెట్టి ఆకును రక్షించుకునే పనిలో నిమగమై ఉన్నారు. ఉద్దండపురంలో కాలువుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటర్‌ పెట్టి వరి నారును తడుపుతున్నారు. ఒకపక్క తడుపుతుంటే మరోపక్క ఎండకి వరి ఆకు ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో వరి సాధారణ సాగు 5125 ఎకరాలు కాగా, ఇప్పటికి 350 ఎకరాల్లో మాత్రమే రైతులు ఉడుపులు వేశారు.వరుణుడు ముఖం చాటేయడంతో ఉడుపులు స్పీడు అందుకోలేదు. అడపా దడపా కురిసిన వర్షాలకు మండలంలో ముకుందరాజుపేట, డొంకాడ, దోసలపాడు, ఉద్దండపురం, రమణయ్యపేట, గుల్లిపాడు గ్రామాల్లో మాత్రమే కొంతమేర ఉడుపులు ప్రారంభించారు. అయితే వర్షాలు కురవక పోవడంతో ఉడిసిన మడులు బీటలువారి వరి నాట్లు ఎండి పోతున్నాయి. దీన్ని రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 40 శాతం వర్షపాతం లోటు ఉంది. వర్షాలు సక్రమంగా లేనందున చెరువులు, బావులు, కాలవుల్లో నీటి చుక్క లేక పోవడంతో రైతులు దమ్ములు చేయలేక పోతున్నారు. ఆరంభంలోనే ఇలా ఉంటే వరి సాగు సాగుతుందా లేదా అన్న మీమాంసంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి సాగు ఆశాజనకంగా సాగింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. వర్షాలు సక్రమంగా కురిసి ఉంటే ఈ పాటికే మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఉడుపులు పూర్తయి వరి చేనుతో పొలాలు పచ్చగా కళకళలాడుతూ కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించ లేదు. పొలాలన్నీ ఖాళీగా దర్శన మిస్తున్నాయి.