Oct 30,2023 20:24

తేమ లేక ఎండిపోతున్న జొన్న

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రతేడాది అనావృష్టి, అతివృష్టి వల్ల రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని రైతులు భావించారు. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు కురవక పంటు ఎండుముఖం పట్టాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల పాలయ్యారు. కనీసం రబీ సీజన్‌లోనైనా వర్షాలు కురిసి పంటలు పండుతాయని రైతులు ఆశపడ్డారు. పదునైన వర్షం ఒక్కటి కూడా కురవలేదు. పంటలు ఎండిపోతున్నాయి.
చిప్పగిరి మండలంలో మొత్తం సాగు భూమి 74,157.38 ఎకరాలు. ఖరీఫ్‌ సాగు 18,500 ఎకరాలు. మండలంలో రబీ సీజన్‌లో వేసే పంటలపైనే రైతులు అధిక ప్రాధాన్యత కనబరుస్తున్నారు. రబీ సీజన్‌లో ప్రధానంగా పప్పు శనగ, జొన్న, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేశారు. ఎక్కువ భాగం పప్పు శనగ పంటనే సాగు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు నల్లరేగడి పొలాల్లో పప్పు శనగ పంటను సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి వర్షాలు లేక మొలకెత్తిన పైరు ఎండ వేడిమికి భూమి పొరల్లోనే ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరా పప్పు శనగ విత్తనం వేసుకోవాలంటే మొత్తం పెట్టుబడి కనీసం రూ.8 వేలు నీళ్ల మందులు మినహాయించి అవుతుందని రైతులు తెలుపుతున్నారు. మండలంలో ప్రధానంగా చిప్పగిరి, కుందనగుర్తి, నేమకల్లు, బెల్డోనా, నగరడోనా, ఏరూరు, గుమ్మనూరు, దౌల్తాపురం గ్రామాలలో దాదాపు 70 శాతం పప్పు శనగ పంటపైనే రైతులు ఆధారపడుతున్నారు. ఈ రెండు నెలల్లో మంచి తేమ గల వర్షం కురవకపోడంతో పంటలు పండుతాయో లేదోనని రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. సాగు చేసిన పప్పు శనగ పైరు ఎండిపోతున్నా వర్షం వస్తుందనే ఆశతో మళ్లీ అప్పులు చేసి నీళ్లు మందులు తెచ్చి పైరుకు స్ప్రే చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో దెబ్బతిన్నామని, కనీసం రబీ సీజన్‌లోనైనా పంటలు వస్తాయనుకుంటే ఇప్పటివరకు ఆ జాడ కూడా కనబడడం లేదని రైతులు వాపోతున్నారు.
ఖరీఫ్‌, రబీ పంటల్లో నష్టపోయాం
- రైతు అశోక్‌, నేమకల్లు గ్రామం

నాకున్న పొలంలో ఖరీఫ్‌ సీజన్‌లో ఐదు ఎకరాలు పత్తి సాగు చేశాను. రబీలో మూడు ఎకరాల్లో పప్పు శనగ విత్తనం సాగు చేశాను. రెండు పంటలకు కూడా అప్పు చేసి దాదాపు రూ.70 వేలు దాకా పెట్టుబడి పెట్టాం. పత్తి పంట వేసి నాలుగు నెలలు కావస్తున్నా వర్షం లేనందున కాయ ఏపుగా రావడం లేదు. పప్పు శనగ మొలకెత్తిన పైరే ఎండ వేడిమికి తట్టుకోలేక ఎండిపోతోంది. రూ.వేలుకు వేలు పెట్టుబడులు పెట్టి పంటలు చేతికి రాకపోతే మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

ఎండిపోయిన పప్పు శనగ
ఎండిపోయిన పప్పు శనగ