ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ మరోసారి చర్చకు వచ్చింది. గత రెండేళ్లలో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలు మినహా మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కరోనా సంక్షోభ సమయంలో వైద్య, ఆరోగ్య శాఖలో మాత్రమే కొన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేశారు. రాష్ట్రంలో సంవత్సరానికి దాదాపు 3 లక్షల మంది రకరకాల డిగ్రీలతో కళాశాలల నుండి బయటకు వస్తున్నారు. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణ తగినంతగా జరగకపోవటం, ప్రైవేట్ రంగంలో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోవడంతో నిరుద్యోగం తీవ్రతరమైంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
జాబ్ క్యాలెండర్
వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తమ ప్రభుత్వం వస్తే ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ లేదా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. సంవత్సరంలో ఏయే ఉద్యోగాలను భర్తీ చేస్తారు? ఎన్ని ఖాళీలు ఉంటాయి? ఏ నెలలో పరీక్షలు నిర్వహిస్తారు? మొదలైన వివరాలతో ప్రభుత్వం వార్షిక క్యాలెండర్ ప్రకటిస్తుంది. దానికనుగుణంగా నిరుద్యోగులు తగు ప్రణాళికతో ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ కావటానికి అవకాశం ఉంటుంది. జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి 1న వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆచరణలో అమలు జరగలేదు. ఇటీవల నెల రోజుల క్రితం జరిగిన సమీక్షలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు తమ ప్రసంగాలలో వార్షిక క్యాలెండర్ గురించి ప్రస్తావన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలి.
డిఎస్సి పోస్టులు
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒక్క డిఎస్సి మాత్రమే జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినప్పటికీ 5 ఏళ్ల కాలంలో 2018లో మాత్రమే డిఎస్సి ప్రకటించింది. దానిలో కేవలం 7 వేల పోస్టులు ప్రకటించింది. ఇప్పటికి 6 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. కోర్టు కేసుల వలన ఇంకా వెయ్యి పోస్టులు భర్తీ చేయవలసి ఉన్నది.
ప్రస్తుతం ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్‌కు ప్రయత్నాలు ప్రారంభించలేదు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో దాదాపు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు 16 వేలు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ ప్రకటించింది. వీటితో పాటు స్కూల్ అసిస్టెంట్లు, మోడల్ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ తదితర పాఠశాలలతో కలిపి దాదాపు 25 వేల పోస్టులు భర్తీ చేయవలసి వున్నది. 'టెట్' నోటిఫికేషన్ ఇస్తామని విద్యామంత్రి ఇప్పటికి 10 సార్లు ప్రకటించినప్పటికి నేటికీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. వెంటనే 'టెట్, డిఎస్సి' నోటిఫికేషన్లు ప్రకటించాలి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు
రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ప్రధాన రిక్రూటింగ్ ఏజన్సీగా ఉన్నది. దీని పని తీరు నిరాశాజనకంగా ఉన్నది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మొదలగు ఉద్యోగాలతో పాటు డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు తదితర పోస్టులన్నింటినీ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో సర్వీస్ కమిషన్ పనితీరు అనేక విమర్శలకు దారితీసింది. అప్పటి చైర్మన్ తెచ్చిన సంస్కరణలు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉండడంతో డివైఎఫ్ఐ వంటి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు వాటిని వ్యతిరేకించాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వేలాదిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మొదలైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క రెవిన్యూ శాఖలోనే 1148 పోస్టులు ప్రత్యక్ష భర్తీలో నింపటానికి అధికారులు గుర్తించారు. 670 జూనియర్ అసిస్టెంట్-కమ్-కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎప్పుడో అనుమతి ఇచ్చినప్పటికి సర్వీస్ కమిషన్ ఇంత వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కేరళ తరహాలో పారదర్శకమైన మార్పులు తేవాలి. ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు వివిధ శాఖలు సర్వీస్ కమిషన్‌కు అందించే విధంగా విధానాల రూపకల్పన చేయాలి.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగుల భర్తీకి ప్రత్యేకంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నది. పోలీస్ ఉద్యోగాలు దాదాపు 15 వేల వరకు ఖాళీలు ఉన్నప్పటికీ, తొలి దశలో 6 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, సుమారు 1000 సబ్-ఇన్స్పెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని హోంశాఖ మంత్రి ఇప్పటికి 5 సార్లు ప్రకటించారు. నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఎక్కువగా బి.సి, ఎస్.సి, ఎస్.టి లకు సంబంధించిన అభ్యర్థులే పోటీ పడుతున్నారు. త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థులకు న్యాయం చేయవలసిన అవసరమున్నది.
ఇతర శాఖలు
రాష్ట్ర్రపాలనలో ముఖ్య శాఖలైన మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు, విద్య, వైద్య ఆర్యోగశాఖ మొదలగు వాటిలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాంక్షన్డ్ పోస్టులలో కూడా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తూ శాశ్వత ప్రాతిపదికపై పోస్టుల భర్తీని చేపట్టడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలలో ప్రత్యక్ష భర్తీకి అర్హమైన పోస్టులన్నింటినీ గుర్తించి వాటిని జాబ్ క్యాలెండర్లో చేర్చాలి.
వయోపరిమితి
2014 నుండి ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు ఒక క్రమపద్ధతిలో ఇవ్వకపోవటంతో అనేకమంది నిరుద్యోగ అభ్యర్థులకు వయస్సు పెరిగిపోయింది. ప్రభుత్వం నిరుద్యోగుల వయోపరిమితిని 42 సంవత్సరాలకు సడలిస్తూ జీవో జారీ చేసింది. కాని నోటిఫికేషన్లు మాత్రం వెలువడలేదు. అందువలన రాబోయే నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగుల వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు 47 ఏళ్లతో పాటు, పోలీస్ ఉద్యోగాలకు కూడా 2 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ద్వారా కొంతైనా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వివిధ ప్రభుత్వ శాఖల లోని ఖాళీలు, గ్రూప్-2 పోస్టులు, డిఎస్సి పోస్టులు, పోలీస్ శాఖలో ఖాళీలతో జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. రాష్ట్రంలో 13 జిల్లాలలో పేద, గ్రామీణ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలి.
కె.ఎస్ లక్ష్మణరావు / వ్యాసకర్త శాసన మండలి సభ్యులు,
సెల్ : 9440262072 /










